మహబూబాబాద్‌లో పట్టపగలు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ దారుణహత్య

Mahabubabad TRS Councillor Murdered - Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: బైక్‌పై వెళ్తున్న టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టారు. ఆపై గొడ్డలి, తల్వార్లతో విచక్షణారహితంగా నరికారు. రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతిచెందారు. మహబూబాబాద్‌ పట్టణంలో పట్టపగలు జరిగిన ఈ హత్యోదంతం సంచలనం కలిగించింది. 

హత్యకు ఆర్థిక లావాదేవీలు, భూతగాదాలే కారణమై ఉండొచ్చని పోలీసులు అంటుండగా, కౌన్సిలర్‌ రాజకీయ ఎదుగుదల చూడలేక ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ ఈ హత్య చేయించారని మృతుడి తల్లి, భార్య ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకూ ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్‌ పట్టణంలోని బాబూనాయక్‌తండాకు చెందిన 8వ వార్డు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ బానోత్‌ రవినాయక్‌ (34) గురువారం ఉదయం పత్తిపాకలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి బైక్‌పై వెళ్తున్నారు. పత్తిపాక సెంటర్‌ వద్ద కొంతమంది ట్రాక్టర్‌తో వచ్చి రవినాయక్‌ వాహనాన్ని ఢీకొట్టగా, రవి కింద పడిపోయారు. 

అప్పటికే ఆయనను కారులో వెంబడిస్తున్న దుండగులు, ట్రాక్టర్‌పై వచ్చిన వారిలో ఒకరు గొడ్డలి, తల్వార్లతో రవిపై దాడిచేశారు. తలపై నరకడంతో రవి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, చనిపోయినట్లు భావించి దుండగులు పరారయ్యారు. అదే సమయంలో అటుగా వెళుతున్న రవినాయక్‌ బావమరిది చిరంజీవి.. రక్తపు మడుగులో పడి ఉన్న రవినాయక్‌ను చూసి చుట్టుపక్కల వారి సాయంతో 108లో మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ రవినాయక్‌ మృతిచెందారు.  

హత్యలో రాజకీయ ప్రమేయం లేదు: ఎస్పీ
రవినాయక్‌ నల్లబెల్లం, కట్టెల వ్యాపారం చేసేవారు. ఇందులో ఆర్థిక లావాదేవీల్లో వచ్చిన విభేదాలతోనే రవి హత్య జరిగిందన్న చర్చ జరుగుతోంది. దీంతో పాటు భూతగాదాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పోలీసులు ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. రవినాయక్‌పై రౌడీషీట్‌ కూడా ఉందని అంటున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ మాట్లాడుతూ.. ఆర్థిక, వ్యాపార లావాదేవీలే హత్యకు కారణమని భావిస్తున్నామని, ఇందులో రాజకీయ ప్రమేయమేమీ లేదని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top