ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు

Lover Kills Her Girl Friend In Chittoor - Sakshi

సాక్షి, పెనుమూరు(చిత్తూరు): నమ్మి వచ్చిన ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడిని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. గురువారం చిత్తూరు డీఎస్పీ సుధాకరరెడ్డి తెలిపిన వివరాలు.. బిహార్‌ రాష్ట్రం, గోపాల్‌ గంజి జిల్లా, మధు సారియా గ్రామానికి చెందిన రాజ్‌దూత్, అతని పక్కింటికి చెందిన కవితకుమారి(20) ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఒక్కటి కావడంతో కవితకుమారి గర్భం దాల్చింది.

ఫలితంగా తనను ఎక్కడికైనా తీసుకెళ్లాలని ప్రియుడిని ఆమె బలవంతం చేయడంతో చెన్నైలో ఉద్యోగం చేస్తున్న రాజ్‌దూత్‌  ఆమెను చిత్తూరుకు తీసుకొచ్చాడు. ఈ ఏడాది అక్టోబర్‌ 11న చిత్తూరులోని ఓ సెల్‌ఫోన్‌ షాపులో ఫోన్‌ రిపేరు చేసుకున్నారు. అనంతరం పెనుమూరు క్రాస్‌ రోడ్డు సమీపంలో ఉన్న శ్రీవెంకటేశ్వరా ఇంజినీరింగ్‌ కళాశాలలో కవిత కుమారిని బీ–ఫార్మసీ కోర్సులో చేర్చేందుకు ప్రయత్నించాడు.

అయితే సీటు లభించకపోవడంతో మండలంలోని కలవగుంట పంచాయతీ విజయనగరం యానాదికాలనీలో ఓ ఇంట అద్దెకు దిగారు. అబార్షన్‌ చేసుకోవాలని ప్రియురాలిపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె ససేమిరా అనడంతో  అంతం చేయాలని స్కెచ్‌ వేశాడు. ఆమె నిద్రిస్తున్న సమయంలో ముఖంపై దిండుతో గట్టిగా అదిమి, ఊపిరి ఆడకుండా చేసి, హతమార్చాడు. అనంతరం ఆమె దుస్తులతో సహా ఎలాంటి ఆధారాలు లేకుండా అతడు పారిపోయాడు.

రెండు రోజుల తర్వాత ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానించారు. అక్టోబర్‌ 19న  పోలీసులకు సమాచారం ఇచ్చారు. పాకాల సీఐ ఆశీర్వాదం, ఎస్‌ఐ నరేంద్ర అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహం వెలుగులోకి వచ్చిన రూములో లభించిన మొబైల్‌ షాపు విజిటింగ్‌ కార్డు, ఓ షర్టుపై ఉన్న స్టిక్కర్‌ కేసు దర్యాప్తుకు ‘క్లూ’లయ్యాయి. అలాగే, మొబైల్‌ షాపులోని సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top