రూ. కోటితో చిక్కిన రఘునందన్‌ బావమరిది

Hyderabad Police Arrest Raghunandan Rao Brother Law And One Crore Seized - Sakshi

శ్రీనివాసరావుకు అందించిన ‘విశాఖ’ సంస్థ మేనేజర్‌

దుబ్బాకకు తరలించే ప్రయత్నాల్లో ఉండగా పట్టివేత

స్వేచ్ఛాయుత పోలింగ్‌కు కట్టుబడి ఉన్నాం: హైదరాబాద్‌ సీపీ

సాక్షి, హైదరాబాద్‌: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటల ముందు ఆ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌ రావు బావమరిది సురభి శ్రీనివాసరావు రూ.కోటి నగదుతో చిక్కారు. పెద్దపల్లి మాజీ ఎంపీకి చెందిన, బేగంపేటలోని విశాఖ ఇండ స్ట్రీస్‌ నుంచి ఈ నగదును తీసుకున్న శ్రీనివాస రావు దుబ్బాకకు తరలించే ప్రయత్నాల్లో ఉండగా పట్టుకున్నామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆది వారం ప్రకటించారు. ఈ డబ్బుకు, దుబ్బాక ఉప ఎన్నికకు మధ్య సంబంధం ఉన్నట్లు ఆధారాలు సైతం లభించాయని ఆయన స్పష్టం చేశారు. టాస్క్‌ఫోర్స్‌ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు. సీపీ తెలిపిన వివరాలు... సిద్దిపేటకు చెందిన శ్రీనివాసరావు పటాన్‌చెరులో దాదాపు పదేళ్లుగా ఏ టు జెడ్‌ సొల్యూషన్స్‌ పేరుతో టెక్నికల్, మ్యాన్‌పవర్‌ సరఫరా వ్యాపారం చేస్తున్నారు. ఈయన ఆదివారం మధ్యా హ్నం తన కారు డ్రైవర్‌ టి.రవికుమార్‌తో కలిసి బేగంపేటకు వచ్చారు. విశాఖ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సంస్థ మేనేజర్‌ నుంచి రూ.కోటి తీసుకున్నారు.

ఈ మొత్తాన్ని తన కారులో పెట్టుకుని దుబ్బాకకు తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈ విషయంపై పోలీసులకు ఉప్పందింది. దీంతో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌కు కె.నాగేశ్వరరావు నేతృత్వంలో ఎస్సై థక్రుద్దీన్‌తో కూడిన బృందం రంగంలోకి దిగింది. బేగంపేట ప్రాంతంలో శ్రీనివాస రావు ప్రయాణిస్తున్న కారును ఆపింది. అందులో ఉన్న రూ.కోటి నగదుతోపాటు ఆయన ఫోన్‌ను స్వాధీనం చేసుకుంది. ఈ ఫోన్‌లో లభించిన ఫేస్‌టైమ్‌ కాల్స్‌ వివరాలు, వాట్సాప్‌లో ఉన్న సందేశాలు, ఇతర అంశాలు పరిశీలించిన నేపథ్యంలో ఈ నగదు రఘునందన్‌రావు సూచనల మేరకు దుబ్బాకకు తీసుకువెళ్తున్నారని, అక్కడ ఓటర్లకు పంచిపెట్టడానికి పథకం వేశారని అనుమానిస్తున్నామని అంజనీకుమార్‌ పేర్కొన్నారు. నిందితుడు తమ అదుపులో ఉండగా అనేకసార్లు రఘునందర్‌రావు నుంచి అతడి ఫోన్‌కు కాల్స్‌ వచ్చాయని చెప్పారు. ఈ కేసును బేగంపేట పోలీసులు ప్రత్యేక ఏజెన్సీ సహకారంతో దర్యాప్తు చేస్తారని తెలిపారు. 

పదిరోజుల్లో రూ.2.34 కోట్లు స్వాధీనం
ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి పోలీసు విభాగం కట్టుబడి ఉంది. గత కొన్ని రోజులుగా నగరవ్యాప్తంగా హవాలా దందాపై నిఘా ముమ్మరం చేశాం. ఫలితంగా పది రోజుల వ్యవధిలో రూ.2.34 కోట్లు స్వాధీనం చేసుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నాం. దీనికి ప్రజలిచ్చిన సహకారం, సమాచారమే కీలకంగా మారింది. ఇంకా ఇలాంటి లావాదేవీలపై సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలపాలి. 
– అంజనీకుమార్, హైదరాబాద్‌ పోలీసు కమిషనర్

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top