పెంచి పెద్ద చేస్తే.. ప్రాణం తీసింది

Hyderabad: Adopted Daughter Assassinated Her Foreign Lady - Sakshi

 30 ఏళ్లుగా స్వచ్ఛందసేవలందిస్తున్న విదేశీయురాలు 

సహజీవనం వద్దన్నందుకు కక్ష పెంచుకున్న దత్తపుత్రిక

ప్రియుడితో కలిసి కుట్ర చేసి హత్య    

శంషాబాద్‌(హైదరాబాద్‌): అనాథను ఆదరించి..పెంచి పెద్దచేసిన ఓ విదేశీయురాలు..అదే యువతి కారణంగా హత్యకు గురైంది. తనకో జీవితాన్నిచ్చిన తల్లి లాంటి వృద్ధురాలిని ఆ కసాయి యువతి తన ప్రియుడితో కలిసి కుట్రపన్ని అంతమొదించింది. సహజీవనం వద్దని వారించినందుకు ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. శంషాబాద్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి కథనం ప్రకారం..ఫ్రాన్స్‌ దేశానికి చెందిన మారి క్రిస్టిన్‌ (68) ముప్పై ఏళ్లుగా భారతదేశంలో నివాసముంటోంది.

రాజేంద్రనగర్‌ దర్గా ఖలీజ్‌ ఖాన్, టోలిచౌకిలలో మారికా పేరిట రెండు పాఠశాలలను నిర్వహిస్తూ స్వచ్ఛంద సేవలు అందిస్తోంది. అనాథ, పేద విద్యార్థులకు తన పాఠశాలల్లో విద్యావకాశాలు కల్పిస్తోంది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు కాగా..ఒకరు స్థానికంగా సన్‌సిటీలో, మరొకరు పాండిచ్చేరిలో నివాసం ఉంటున్నారు. మరోవైపు క్రిస్టిన్‌ ప్రియాంక, రోమా అనే బాలికలను దత్తత తీసుకుని వారికి చదువులు చెప్పించి పెద్దచేసింది. వారితోనే కలిసి దర్గా ఖలీజ్‌ఖాన్‌ వద్ద నివాసం ఉంటోంది. ఈ క్రమంలో నాలుగు నెలల క్రితం దత్తపుత్రిక రోమాకు వివాహం చేయడానికి మ్యాట్రిమోని సైట్‌లో వివరాలు పొందుపర్చింది.  

వారించినందుకే.
మ్యాట్రిమోనీలో రోమా అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన విక్రమ్‌ శ్రీరాములు (25)తో స్నేహం పెంచుకుంది. స్నేహం కాస్తా వీరిద్దరు సహజీవనం చేసే వరకు వెళ్లింది. కొండాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో గది తీసుకుని ఇద్దరు కలసి ఉండటంతో మారి క్రిస్టిన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో మారి క్రిస్టిన్‌ను అడ్డుతొలగించుకోవాలని రోమా ప్రియుడు విక్రమ్‌తో కలిసి పథకం పన్నింది. ఈ నెల 8 ఉదయం దర్గా ఖలీజ్‌ఖాన్‌లో నివాసముంటన్న మారి క్రిస్టిన్‌ వద్దకు వెళ్లిన రోమా తనకు కొన్ని డబ్బులు కావాలని అడిగింది.

ఆ తర్వాత టోలిచౌకిలోని పాఠశాల వద్ద వదిలేయమని చెప్పింది. అప్పటికే విక్రమ్‌తో పాటు అతడి స్నేహితుడు రాహుల్‌ గౌతమ్‌ క్రిస్టిన్‌ ఇంటి వద్ద కాపుకాశారు. రోమాను టోలిచౌకిలో వదిలేసిన క్రిస్టిన్‌ ఇంటికి చేరుకోగానే..అక్కడే ఉన్న విక్రమ్, రాహుల్‌ ఆమె గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం ఆమె కారులోనే మృతదేహాన్ని తీసుకెళ్లి హిమాయత్‌ సాగర్‌ చెరువు సమీపంలోని చౌడమ్మ గుట్టల్లో పడేశారు. హత్య అనంతరం మృతురాలి ల్యాప్‌టాప్‌ను తీసుకోవడంతో పాటు ఆమె బ్యాంకు ఖాతాలోంచి రూ.2 లక్షల నగదును కూడా రోమా ఖాతాలోకి మార్చుకుంది.  

అదృశ్యం కేసు నమోదుతో వెలుగులోకి.. 
ఈ నెల 8 ఉదయం నుంచి మారి క్రిస్టిన్‌ కనిపించకపోవడంతో బండ్లగూడ సన్‌సిటీలో నివాసముంటున్న సొంత కూతురు మారికా సొలంగ్‌ భర్త ప్రశాంత్‌ రాజేంద్రనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దత్తపుత్రిక రోమాను అనుమానించి విచారణ చేపట్టడంతో హత్య విషయం వెలుగుచూసింది. కుట్ర పన్నిన రోమాతో పాటు హత్య చేసిన విక్రమ్, రాహుల్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రాజేంద్రనగర్‌ ఏసీపీ సంజయ్‌కుమార్, సీఐ కనకయ్య, ఎస్‌ఓటీ పోలీసులు కేసు చేధించడంలో మంచి ప్రతిభ కనబర్చారని డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.

   చదవండి: బీభత్సం సృష్టించిన కారు.. ముగ్గురి ప్రాణాలు గాల్లో​కి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top