రెప్పపాటులోనే మృత్యు ఒడికి | Husband Killed By Tree Feller, Wife Seriously Injured In Bollaram | Sakshi
Sakshi News home page

Bollaram: రెప్పపాటులోనే మృత్యు ఒడికి

Published Wed, May 22 2024 7:50 AM

Husband killed by tree feller, wife seriously injured

హైదరాబాద్: చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన దంపతులపై అకస్మాత్తుగా చెట్టు కూలి మీద పడడంతో భర్త దుర్మరణం పాలయ్యాడు. భార్య తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతోంది. ఈ విషాదకర సంఘటన బొల్లారం పీఎస్‌ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు..తూంకుంటకు చెందిన ప్రైవేటు ఉద్యోగి రవీందర్‌..బొల్లారం పయనీర్‌ బజార్‌ ప్రభుత్వ పాఠశాల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న భార్య సరళకుమారితో కలిసి హోండా యాక్టివాపై బొల్లారం ఆస్పత్రికి వచ్చారు.

 వాహనం ఆవరణలోకి ప్రవేశించగానే అకస్మాత్తుగా పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం కూలి వీరిపై పడింది. ఈ ఘటనలో రవీందర్‌ అక్కడికక్కడే మృతి చెందగా సరళకుమారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మెరుగైన చికిత్స కోసం సరళాదేవిని గాంధీ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు. 

రవీందర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రమాద సమాచారం అందుకున్న సహచర ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు. సరళకుమారి అనారోగ్యం బారిన పడడంతో చికిత్స కోసం బొల్లారం ఆసుపత్రికి వచ్చారని వారు తెలిపారు. కంటోన్మెంట్‌ బోర్డు అధికారులు ఎండిన భారీ వృక్షాన్ని తొలగించినట్లయితే ప్రమాదం జరిగేది కాదని, పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమేనని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.   

 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement