కోవిడ్‌ పేరుచెప్పి.. సీబీఐని ఏమార్చబోయిన బొల్లినేని

GST Official Bollineni Srinivasa Gandhi Held By CBI - Sakshi

అరెస్టు నుంచి తప్పించుకునేందుకు బొల్లినేని గాంధీ ప్రయత్నం 

కుటుంబ సభ్యులకు కరోనా అంటూ నకిలీ రిపోర్టులు 

అంతా అబద్ధమని తేల్చి అరెస్టు చేసిన సీబీఐ 

మే 7 వరకు రిమాండ్‌ విధించిన కోర్టు 

సాక్షి, హైదరాబాద్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ సీజీఎస్టీ అధికారి బొల్లినేని శ్రీనివాస గాంధీని సీబీఐ అరెస్టు చేసింది. ఆయనను మంగళవారమే అదుపులోకి తీసుకుని, పలు అంశాలపై ప్రశ్నించినా.. బుధవారం సాయంత్రం అధికారికంగా అరెస్టును ప్రకటించింది. తర్వాత సీబీఐ మేజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్టింది. కోర్టు బొల్లినేని గాంధీకి వచ్చే నెల 7వ తేదీ వరకు రిమాండ్‌ విధించింది. 

కోవిడ్‌ పేరుతో డ్రామా 
తన అరెస్టును అడ్డుకోవడానికి బొల్లినేని శ్రీనివాసగాంధీ చివరి నిమిషం వరకు విశ్వప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అరెస్టును ఆపాలంటూ తన ఆంతరంగికులకు ఫోన్లు చేసి ఒత్తిడి తెచ్చాడని తెలిసింది. సీబీఐ అధికారులు ఇంటికి వచ్చేసరికి.. తన కుటుంబ సభ్యులకు కోవిడ్‌–19 పాజిటివ్‌ వచ్చిందంటూ నకిలీ రిపోర్టులు సిద్ధం చేసి ఉంచినట్టు సమాచారం. అవి నకిలీవని తేల్చిన సీబీఐ అధికారులు..బొల్లినేని గాంధీని అదుపులోకి తీసుకున్నా రు. బొల్లినేని గాంధీపై గతేడాది సీబీఐ మరో కేసు ను నమోదు చేసింది. బొల్లినేని ఓ వ్యవహారంలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నుంచి రూ.5 కోట్లు లంచం డిమాండ్‌ చేశాడు.

రూ.10 లక్షలు నగదు, మిగతా రూ.4.90 కోట్లకు సిటీ శివారులో భూములు గిఫ్ట్‌గా ఇవ్వాలని షరతు విధించాడు. ఈ క్రమంలో బాధితుడి ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. ఇలా లంచం కేసు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నప్పటికీ బొల్లినేనికి గత డిసెంబర్‌లో పదోన్నతి రావడం గమనార్హం. అయి తే వరుస ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఫిబ్రవరి 24న సెంట్రల్‌ జీఎస్టీ నుంచి బొల్లినేని గాంధీని సస్పెండ్‌ చేస్తూ..సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ ట్యాక్సెస్‌ ఉత్తర్వులు ఇచ్చింది. 

నోటీసులకు స్పందనే లేదు! 
2019 జూలై 8న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బొల్లినేని శ్రీనివాసగాంధీ, అతని భార్యపై సీబీఐ కేసు నమోదు చేసింది. తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసి.. రూ.3.74 కోట్ల ఆస్తులు గుర్తించింది. ఆ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.200 కోట్ల కంటే ఎక్కువ కావడం గమనార్హం. సీబీఐ నమోదు చేసిన కేసు, ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. 2010 నుంచి 2019 మధ్య శ్రీనివాస గాంధీ ఆస్తులు ఏకంగా 288 శాతం పెరిగాయి. ఈ కేసుకు సంబంధించి పలుమార్లు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చినా.. గాంధీ స్పందించలేదని, ఒక్కరోజు కూడా విచారణకు రాలేదని సీబీఐ అధికారులు తెలిపారు. అసలు సీబీఐ అడిగిన ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వివరించారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్నవారిపై బెదిరింపులు, ప్రలోభాలకు దిగాడని, వారు విచారణకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. ఈ మేరకు బాధితులు సీబీఐ అధికారులకు మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు అరెస్టు చేశారు.   

చదవండి: (బొల్లినేని శ్రీనివాస గాంధీ అరెస్ట్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top