కూలీలను లాక్కెళ్లిన మృత్యువు | Sakshi
Sakshi News home page

కూలీలను లాక్కెళ్లిన మృత్యువు

Published Sat, Apr 9 2022 3:42 AM

Four Labourers Killed In Road Accident In Hanumakonda District - Sakshi

సాక్షి ప్రతినిధి వరంగల్‌/శాయంపేట/ఎంజీఎం: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మందారిపేటలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహిళా కూలీలతో వెళ్తున్న గూడ్స్‌ వాహనాన్ని ఎదురుగా వచ్చిన ఓ లారీ ఒరుసుకుంటూ వెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

ఒకే వాహనంలో 45 మంది వెళ్తుండగా... 
శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామానికి చెందిన వ్యవసాయ మహిళా కూలీలకు ఉపాధి లేక నిత్యం మొగుళ్లపల్లి మండల పరిధిలోని మిర్చి తోట ల్లో కూలికి వెళ్తున్నారు. రోజుమాదిరే గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన 45 మంది మహిళా కూలీలు అదే గ్రామానికి చెందిన క్యాతం రాజుకు చెందిన ట్రాలీ వాహనంలో మొగుళ్లపల్లి మండలం మెదరమెట్ల గ్రామానికి బయలుదేరారు.

ట్రాలీలో కుడివైపున 10 మంది, ఎడమ వైపు 10 మంది నిలబడగా మధ్యలో మిగతావారు ఉన్నారు. ట్రాలీకి ఇరువైపులా నిలబడిన వారు చేతులు, తల బయటికి పెట్టి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో గోవిందాపూర్, తహరాపూర్‌ గ్రామాల శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయం సమీపంలోని మూలమలుపు వద్దకు రాగానే భూపాలపల్లి నుంచి హనుమకొండ వైపు వేగంగా వస్తున్న లారీని బూడిద లోడ్‌తో వెళ్తున్న లారీ ఓవర్‌టేక్‌ చేస్తూ ట్రాలీ కుడివైపున (డ్రైవర్‌ సీటువైపు) రాక్కుంటూ వెళ్లింది. దీంతో ఆ వైపు బయటికి చేతులు, తల పెట్టిన బాబు రేణుక (45), పూల మంజుల (45) అక్కడికక్కడే మృతి చెందారు.

దండెబోయిన విమల (45), చల్లా అయిల్‌ కొమురమ్మ (45), కొడిమాల సరోజన, చల్లా రాధ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో సరోజన, రాధల చేతులు తెగిపడ్డాయి. చికిత్స నిమిత్తం వారిని వెంటనే వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా విమల, కొమురమ్మ కన్నుమూశారు. స్వల్పంగా గాయపడిన సురబోయిన రేణుక, జక్కుల ఐలమ్మ, గుండెబోయిన ఓదమ్మ శాయంపేటలోని ఆర్‌ఎంపీ వద్ద చికిత్స పొందుతుండగా తలకు గాయమైన మరో క్షతగాత్రురాలు మేకల లక్ష్మి ఎంజీఎంలో చికిత్స పొందుతోంది. తెగిపడిన చేతులు, తలభాగాలతో ఘటనాస్థలిలో భీతావహ దృశ్యం నెలకొంది. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.  

దేవుడు ఇలా చేస్తాడనుకోలేదు...  
నా భార్య కూలి కోసం వెళ్లిన అరగంటకే ప్రమాదం జరిగిందని ఫోన్‌ వచ్చింది. 10 నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నా భార్యను అంబులెన్స్‌లో ఎక్కించా.  చికిత్స పొందుతూ చనిపోయింది. దేవుడు ఇంత పనిచేస్తాడనుకోలేదు. 
– విమల భర్త దండబోయిన కొమురయ్య 

అమ్మా.. నేనెట్ల బతకాలి.. 
కూలి పనికి వెళ్లి కానరాని లోకాలకు పోయావా అమ్మా. పనికి పోయి ఇంటికి వస్తదనుకున్నాం. అమ్మ నువ్వు లేనిది నేను ఎట్ల బతకాలి అమ్మా.  
– మంజుల కుమార్తె, పూల నాగలక్ష్మి 

సీటీ స్కాన్‌ కోసం గంట నిరీక్షణ 
ఎంజీఎం: ఎంజీఎం ఆస్పత్రిలో అత్యవసర సేవ లు అధ్వానంగా తయారయ్యాయి. ఓ రోగిని ఎలుకలు కొరికిన ఘటన మరువకముందే  అత్యవసర సేవల్లోని డొల్లతనం బయటపడింది. శుక్రవారం మందారిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతల రాధ చేయి తెగింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యులు ఆమె కు సీటీ స్కాన్‌ రాయగా ఆస్పత్రిలో సీటీ స్కాన్‌ 3 నెలలుగా పనిచేయకపోవడంతో సిబ్బంది  బాధితురాలిని కాకతీయ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. కానీ  అక్కడ ఆ సమయానికి టెక్నీషియన్‌ లేక, విద్యుత్‌ లేక గంటపాటు నిరీక్షించాల్సి వచ్చింది.    

Advertisement
Advertisement