పచ్చని కాపురంలో కరెంటు చిచ్చు

Former Couple Deceased With Current Shock in Medak - Sakshi

మృత్యువులోనూ వీడని బంధం

విద్యుత్‌ షాక్‌తో రైతు దంపతుల దుర్మరణం 

అనాథలైన ఇద్దరు చిన్నారులు 

చౌదరిపల్లిలో పెను విషాదం 

వర్గల్‌(గజ్వేల్‌): పచ్చని కాపురంపై విధి కన్నెర్ర చేసింది. విద్యుత్‌ షాక్‌ రూపంలో రైతు దంపతులను కాటేసింది. ఏడేళ్లలోపు అన్నా, చెల్లెల్లకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేసింది. వ్యవసాయ బావి వద్ద సంపుహౌజ్‌లో కాళ్లు, చేతులు కడుక్కునేందుకు వెళ్లిన దంపతులు విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం వర్గల్‌ మండలం చౌదరిపల్లిలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళ్తే.. వర్గల్‌ మండలం చౌదరిపల్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు మానుక వెంకటేష్‌గౌడ్‌(30), రేణుక(26)లకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి శరత్‌(7), తనూష(4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉదయం 7 గంటలకు స్వీట్‌కార్న్‌ కంకులు తెంపేందుకు వెళ్లిన దంపతులు పని ముగించుకొని కాళ్లూచేతులు కడుక్కునే సమయంలో సంపులో మోటారు నడుస్తుండగా షార్ట్‌ సర్క్యూట్‌తో నీళ్లకు షాక్‌ వస్తున్న విషయం తెలియని వారు కాలు కడుక్కుంటగా విద్యుత్‌ షాక్‌కు గురై    మృతి చెందారు.  

రోదనలతో దద్దరిల్లిన వ్యవసాయ క్షేత్రం 
అందరితో కలివిడిగా ఉంటూ తమ పని తాము చేసుకుంటూ గుట్టుచప్పుడు కాకుండా కాలం వెల్లదీస్తున్న రైతు దంపతులు కరెంట్‌షాక్‌తో దుర్మరణం పాలైన సమాచారం తెలిసి పెద్ద సంఖ్యలో కుటుంబీకులు, బంధువులు, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాల మీద పడి కుటుంబీకులు బోరుమన్నారు. కంకులు తెంపి తొందరగా వస్తమని పసి పిల్లలను అప్పచెప్పి వెళ్లిన కొడుకు, కోడలు కానరాకుండా పోయారని మృతుడి తల్లి ఎల్లమ్మ బోరుమంటుంటే ఆపడం ఎవరితరం కాలేదు.  

చిన్ని, నాన్న.. ఇక సెలవ్‌..
చిన్ని, నాన్న.. ఇక సెలవ్‌ అంటూ పసి పిల్లలను వదిలేసి తల్లిదండ్రులు నింగికేగారు. అమ్మా..రోజూ మాకు గోరుముద్దలు తినిపిస్తావు. బడికి తయారు చేస్తవు. ప్రేమను, ఆప్యాయతను పంచుతూ నాన్న బండి మీచిన్ని, నాన్న.. ఇక సెలవ్‌ద బడికి తీసుకెళ్తుంటే..టాటా చెబుతావ్‌..ఇంతలోనే ఏమైందమ్మా. ఇక మాకు మీరు కన్పించరా..అన్నట్లు ఎన్నెన్నో ప్రశ్నలు వేస్తున్నట్లు వెంకటేష్‌ దంపతుల కొడుకు, కూతురు బేల చూపులు..తల్లిదండ్రులు కానరాని తీరాలకు చేరిపోయారని తెలియని అమాయకత్వం ఆ చిన్నారుల కళ్లలో కన్పిస్తుంటే చూపరుల గుండెలు తరుక్కుపోయాయి.  

తలకొరివి పెట్టిన చిన్నారి 
చివరకు ఏడేళ్ల కొడుకు శరత్, తాత సత్తయ్యగౌడ్‌తో నడుస్తూ తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించాడు. తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నాడు. ఈ విషాదకర ఘటనతో చౌదరిపల్లి గ్రామం గొల్లుమన్నది. ఘటనపై గౌరారం ఎస్సై వీరన్న కేసు నమోదుచేసి పోస్టుమార్టం అనంతరం దంపతుల మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు. 

పరామర్శించిన ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి 
దంపతులు మృతి చెందిన సమాచారం తెలిసి గజ్వేల్‌ ప్రభుత్వాస్పత్రి మృతుల కుటుంబీకులను ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి పరామర్శించి ఓదార్చారు. ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతిచెందిన రైతు దంపతులకు టీఆర్‌ఎస్‌ సభ్యత్వం ఉన్నందున రూ. 2 లక్షల చొప్పున పార్టీ నుంచి బీమా పరిహారం ఇప్పిస్తామన్నారు.  అన్ని విధాల ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top