సాక్షి, శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 9 మంది మరణించగా, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రాపాక విజయ(48)-టెక్కిలి, రామేశ్వరానికి చెందిన ఏదూరి చిన్మమ్మి(50)-రామేశ్వరం, మురిపించి నీలమ్మ(60)-దుక్కవానిపేట, దువ్వు రాజేశ్వరి(60)-చెలుపటియా, యశోదమ్మ(56) శివరాంపురం, రూప(గుడిభద్ర), డోక్కర అమ్ము(పలాస), నిఖిల్(13)-బెంకిలి, బృందావతి(62)-మందసగా గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కార్తీక మాసం నేపథ్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈరోజు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీ కారణంగా ఆలయంలో ఉన్న రెయిలింగ్ ఊడిపోయి భక్తులు కిందపడిపోయారు. అనంతరం, తొక్కిసలాట చోటుచేసుకుంది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.


