6 లింగమార్పిడి సర్జరీలు.. ట్రాన్స్‌జెండర్‌ ఆత్మహత్య

First Transgender To File Nomination As Candidate In Kerala Polls Dies By Suicide - Sakshi

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన తొలి ట్రాన్స్‌జెండర్‌ మృతి

అనారోగ్య సమస్యల వల్లే ఆత్యహత్య చేసుకున్నట్లు భావిస్తున్న పోలీసులు

తిరువనంతపురం: కేరళ తొలి ట్రాన్స్‌జెండర్‌ రేడియో జాకీ, అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన మొదటి ట్రాన్స్‌జెండర్‌ అనన్య కుమారి అలెక్స్‌ మంగళవారం ఆత్మహత్య చేసుకుని మరణించారు. కొచ్చిలోని ఆమె నివాసంలో ఉరి వేసుకుని కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. అనన్య కుమారి ఏడాది నుంచి పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. గతేడాది జూన్‌లో ఆమె ఆరు లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. వీటి వల్లనే అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు సమాచారం. 

తనకు సర్జరీ చేసిన ఆస్పత్రి, వైద్యులపై పలు ఆరోపణలు చేశారు అనన్య కుమారి. లింగ మార్పిడి చికిత్సల అనంతరం తాను పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు. సర్జరీ చేసి ఏడాది పూర్తి కావొస్తున్న తన ఆరోగ్యం కుదుటపడలేదని.. దారుణమైన బాధ కలుగుతుందని ఆరోపించారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తాను ఇంకా కోలుకోలేకపోతున్నానని.. తనకు న్యాయం చేయాలని గతంలో అనన్య కుమారి డిమాండ్‌ చేశారు. అనన్య ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అన్యన్య కుమారిది ఆత్మహత్యగా తేల్చారు పోలీసులు. అనారోగ్య కారణాల వల్లనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. 

ఈ ఏడాది జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్‌ దాఖలు చేయడంతో అనన్య కుమారి పేరు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల్లో అనన్య డెమొక్రాటిక్‌ సోషల్‌ జస్టిస్‌ పార్టీ(డీఎస్‌జేపీ) అభ్యర్థిగా ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ అభ్యర్థి పీకే కుంజలికుట్టికి వ్యతిరేకంగా నామినేషన్‌ దాఖలు చేశౠరు. అయితే పోలింగ్‌కు ఒక రోజు ముందు ఆమె తన ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేశారు. తనను బెదిరిస్తున్నారని.. ముఖ్యంగా సొంత పార్టీ నాయకులే తనను వేధింపులుకు గురి చేస్తున్నారని.. అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఆమె డీఎస్‌జేపీకి ఓటు వేయవద్దని బహిరంగంగానే విజ్ఞప్తి చేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top