పరీక్షకు ఆలస్యం.. ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య 

Denied Entry At Exam Centre For Being Late Telangana Student Dies By Jumping Into Dam and Suicide Note Recovered - Sakshi

సాత్నాల ప్రాజెక్టులో దూకిన శివకుమార్‌ 

‘ఎగ్జామ్‌ మిస్సయ్యాను.. నన్ను క్షమించు’ అని తండ్రిని ఉద్దేశిస్తూ సూసైడ్‌ నోట్‌ 

ఆదిలాబాద్‌ జిల్లా మాంగూర్లలో విషాద ఘటన 

జైనథ్‌:  పరీక్షకు ఆలస్యం కావడంతో ఆవేదన చెందిన ఇంటర్‌ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ‘జీవితంలో మొదటిసారి ఎగ్జామ్‌ మిస్సయ్యాను. క్షమించు నాన్నా..’అంటూ లేఖ రాసి సాత్నాల ప్రాజెక్టులో దూకాడు. గురువారం ఉదయం ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. పోలీసులు, గ్రామస్తులు వెల్లడించిన వివరాల మేరకు.. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం మాంగుర్ల గ్రామానికి చెందిన టేకం రాము, పంచపుల దంపతుల రెండో కుమారుడు శివకుమార్‌ (16). ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో ఇంటర్‌ సీఈసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం మొదటి పరీక్ష ఉండగా.. ఉదయం 8.30గంటలకు గ్రామం నుంచి ఆటోలో ఆదిలాబాద్‌కు బయల్దేరాడు. మధ్యలో ఉండగా ఆలస్యం అవుతోందని ఆవేదన చెందాడు. ఆ సమయంలో ఆదిలాబాద్‌ వైపు వెళ్తున్న ఓ పరిచయమున్న వ్యక్తి ద్విచక్రవాహనంపై ఎక్కాడు. 

ఆదిలాబాద్‌ పట్టణంలోని వినాయక్‌చౌక్‌ వద్దకు చేరుకునే సరికే.. సమయం 9 గంటలు దాటిపోయింది. అక్కడే దిగిపోయిన శివకుమార్‌.. టీఎస్‌టీడబ్ల్యూ కాలేజీలోని పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉంది. కానీ ఆలస్యం కావడంతో పరీక్షకు రానివ్వరని దిగులు చెందాడు. ఆటో ఎక్కి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యాడు. గ్రామ సమీపంలోని సాత్నాల ప్రాజెక్టు వద్ద ఆటో దిగాడు. సూసైడ్‌ నోట్‌ రాసి, దానితోపాటు చేతి వాచీ, పెన్ను, పర్సు వంటివి ఒడ్డుపై ఉంచి ప్రాజెక్టులో దూకేశాడు. కాసేపటికి దీన్ని గమనించిన స్థానికులు.. పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

గజ ఈతగాళ్లతో గాలింపు చేపట్టగా మధ్యాహ్నం సమయంలో శివకుమార్‌ మృతదేహం లభ్యమైంది. ‘‘నాన్నా నన్ను క్షమించు.. నాకోసం ఎంతో చేశావు.. నీ కోసం ఏమీ చేయలేకపోతున్నాను.. జీవితంలో మొదటిసారి ఎగ్జామ్‌ మిస్‌ అయ్యాను..’’అని శివకుమార్‌ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు. పరీక్షకు ఆలస్యంగా వెళ్తే రానివ్వరనే ఆందోళనతో శివకుమార్‌ ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబీకులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

whatsapp channel

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top