Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు | Sakshi
Sakshi News home page

Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు

Published Mon, May 20 2024 7:45 AM

Daughter-in-law murdered uncle

కొడుకులతో కలిసి మామను హత్య చేసిన కోడలు

పోలీసుల అదుపులో నిందితులు 

హసన్‌పర్తి (హనుమకొండ జిల్లా): తాగు నీటి వివాదం ఓ వృద్ధుడి ప్రాణం తీసింది. కొడుకులతో కలిసి ఓ కోడలు మామను హత్య చేసింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. హసన్‌పర్తికి చెందిన జల్లి సారయ్య(80)కు ఇద్దరు కుమార్తెలు తిరుమల, రజితలు, ఇద్దరు కుమారులు రమేశ్, అశోక్‌ ఉన్నారు. కుమారులిద్దరూ గతంలోనే మృతి చెందారు. పెద్ద కుమారుడు రమేశ్‌కు భార్య రమాదేవి, కుమారులు జల్లి సాయికృష్ణ, జల్లి శశికుమార్‌ ఉన్నారు.

నల్లా వచ్చినప్పుడల్లా గొడవే...
జల్లి సారయ్య దంపతులతో పాటు రమాదేవి ఒకే ఇంటిలోని వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. అయితే వీరి ఇంటికి ఒకే నల్లా కనెక్షన్‌ ఉంది. నల్లా వచ్చినప్పుడల్లా వారి మధ్య గొడలు జరుగుతున్నాయి. ఆదివారం నల్లా విషయంలో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోడలు జల్లి రమాదేవి, మనవళ్లు జల్లి సాయికృష్ణ, జల్లి శశికుమార్‌ సారయ్యపై దాడి చేయగా నుదుటిపై బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించి విచారణ చేపట్టారు. తాగునీటి విషయంతోపాటు ఆస్తి తగదాలు కూడా ఉన్నాయని తేలింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతుడి కూతురు తిరుమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement
 
Advertisement
 
Advertisement