సీఈఓ పేరుతో రూ.2.7 కోట్ల టోకరా! | Cyber Scam Case In Hyderabad, Red Rose Supermarket Loses ₹2.7 Crore As Cybercriminals Create Fake CEO WhatsApp Account | Sakshi
Sakshi News home page

Cyber Scam: సీఈఓ పేరుతో రూ.2.7 కోట్ల టోకరా!

Oct 13 2026 1:33 PM | Updated on Oct 13 2026 1:46 PM

Cyber Scam Case In Hyderabad

 వాట్సాప్‌ ఖాతాలోకి చొరబడి కంపెనీ సొమ్ము స్వాహా

ఉద్యోగికి పంపిన జిప్‌ ఫైల్‌తో మొదలైన వ్యవహారం

నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు ఏకంగా ఓ వ్యాపార సంస్థ సీఈఓ పేరుతోనే నకిలీ వాట్సాప్‌ ఖాతా సృష్టించి, ఆ సంస్థ ఖాతా నుంచి రూ.2.7 కోట్లను కొల్లగొట్టారు. సీఈఓనే సందేశాలు పంపినట్లు నమ్మించి అకౌంటెంట్‌తో విడతలవారీగా ఈ మొత్తాన్ని వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించారు. అనుమానాస్పద జిప్‌ ఫైల్‌ను తెరిచిన తర్వాత వాట్సాప్‌ సంభాషణల్లో మార్పులు కనిపించడం, సీఈఓ పేరుతో మరో నంబర్‌ నుంచి సందేశాలు రావడం ఈ వ్యవహారంలో కీలక పరిణామాలు. చివరకు సదరు అకౌంటెంట్‌ సీఈఓను నేరుగా సంప్రదించి నిర్ధారించుకోవడంతో మోసం బయటపడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

నగరానికి చెందిన రెడ్‌ రోజ్‌ సూపర్‌ మార్కెట్‌ సంస్థ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించే అకౌంటెంట్‌ మహమ్మద్‌ అబ్దుల్‌ సత్తార్‌కు సంస్థలోని ఓ ఉద్యోగి వాట్సాప్‌ నంబర్‌ నుంచి జిప్‌ ఫైల్‌ వచ్చింది. ఆయన సదరు ఫైల్‌ను తన ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని తెరిచారు. అనంతరం అదే ఫైల్‌ను కంప్యూటర్‌లో తెరిచేందుకు ప్రయత్నించగా, అది హానికరమైన ఫైల్‌ కావచ్చంటూ అలెర్ట్‌ కనిపించింది. అయినప్పటికీ దాన్ని తెరవడంతో కంప్యూటర్‌ స్పందించడం ఆగిపోయింది. వెంటనే సంస్థ ఐటీ సిబ్బందిని సంప్రదించగా, వారు కంప్యూటర్‌ను పరిశీలించి సాధారణ స్థితికి తీసుకొచ్చారు. సమస్య పరిష్కారమైందని భావించిన అకౌంటెంట్‌ తిరిగి తన విధులు కొనసాగించారు. అయితే, ఆ తర్వాత ఆయన వాట్సాప్‌లో అనుమానాస్పద మార్పులు కనిపించాయి. 

రెడ్‌ రోజ్‌ సూపర్‌ మార్కెట్‌ సంస్థ సీఈఓ జియా ఉర్‌ రెహమాన్‌తో గతంలో జరిపిన వాట్సాప్‌ సంభాషణలు తొలగిపోయినట్లు అకౌంటెంట్‌ గుర్తించారు. అదే సమయంలో సీఈఓ పేరుతో మరో నంబర్‌తో కొత్త కాంటాక్ట్‌ కనిపించింది. ఆ నంబర్‌ నుంచి గతంలో సీఈఓతో జరిగిన సంభాషణలకు సంబంధించిన కొన్ని సందేశాలను పంపడంతో, అది నిజంగానే సీఈఓకు చెందిన నంబర్‌ అని అకౌంటెంట్‌ నమ్మాడు. ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకున్న సైబర్‌ నేరగాళ్లు సంస్థ నిధులను ఇతర ఖాతాలకు బదిలీ చేయాలంటూ సీఈఓ మాదిరిగా అకౌంటెంట్‌కు సూచించారు. ఆ ఆదేశాలు నిజమైనవేనని భావించిన అకౌంటెంట్‌ ఒక్కో విడతగా డబ్బులు పంపడం ప్రారంభించారు. 

ఇలా ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు సంస్థ బ్యాంకు ఖాతా నుంచి మొత్తం ఏడు లావాదేవీల్లో రూ.2.7 కోట్లు బదిలీ చేశారు. ఈ మొత్తాలు ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, క్యాథలిక్‌ సిరియన్‌ బ్యాంక్, బంధన్‌ బ్యాంక్, ఫెడరల్‌ బ్యాంకులకు చెందిన వివిధ ఖాతాలకు బదిలీ అయ్యాయి. అక్టోబర్‌ 9న సీఈఓ పేరుతో ఉన్న వాట్సాప్‌ కాంటాక్ట్‌ నుంచి మరో రూ.50 లక్షలు బదిలీ చేయాలంటూ సందేశం వచ్చింది. దీంతో అనుమానించిన అకౌంటెంట్‌ ఆయనను నేరుగా సంప్రదించి ఆరా తీయడంతో మోసం వెలుగులోకి రావడంతో సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు. అకౌంటెంట్‌ తెరిచిన అనుమానాస్పద జిప్‌ ఫైల్‌ కారణంగానే మొబైల్, కంప్యూటర్‌ లేదా వాట్సాప్‌ సంభాషణలు హ్యాక్‌ అయి ఉండవచ్చని సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. తొలుత సంస్థ ఉద్యోగి వాట్సాప్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు దాని నుంచి అకౌంటెంట్‌కు జిప్‌ ఫైల్‌ పంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement