Cyber Crime: రెచ్చిపోతున్న హ్యాకర్లు! | Sakshi
Sakshi News home page

Cyber Crime: రెచ్చిపోతున్న హ్యాకర్లు!

Published Mon, May 10 2021 6:12 PM

Cyber Crime: Hackers Blackmail Cases Increase in Krishna District - Sakshi

విజయవాడ: ఫేస్‌బుక్‌ అకౌంట్‌  హ్యాక్‌ చేసి వ్యక్తిగత వివరాలు చోరీ చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఈ ఘటనలు కృష్ణా జిల్లాలో అత్యధికంగా చోటు చేసుకుంటున్నాయి. హ్యాకర్లు వ్యూహాత్మకంగా ఫేక్‌ యుఆర్‌ఎల్‌లను పంపి అకౌంట్‌లను హ్యాక్‌ చేస్తున్నట్లు సైబర్‌ క్రైం పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో వినోదం, సమాచార మార్పిడి కోసం ప్రజలు అత్యధికంగా ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగామ్‌లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్‌ వాడే వ్యక్తులు సగటున రోజుకు 8 నుంచి 10 గంటల వరకు ఫోన్‌తోనే గడుపుతున్నట్లు పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. దీనినే ఆసరాగా చేసుకుని హ్యాకర్లు రెచ్చిపోతున్నారు. 

వ్యక్తిగత సమాచారంతో దోపిడీ
ప్రస్తుతం హ్యాకర్లు ఫేస్‌బుక్‌ ఖాతాపై కన్నెశారు. నకిలీ యుఆర్‌ఎల్‌లను ఫేక్‌బుక్‌ ఖాతాలకు/వాట్సప్‌కు ఆకర్షణీయమైన ఫోటోలతో పంపిస్తున్నారు. సదరు యుఆర్‌ఎల్‌ను క్లిక్‌ చేసిన వెంటనే ఫేస్‌బుక్‌ ఖాతా పూర్తిగా సైబర్‌ నేరగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఆనక మన ఫేస్‌బుక్‌ ఖాతా పాస్‌వర్డ్‌ మార్చేసి, అందులోని ఫోటోలను సేకరించి, ఫేస్‌ బుక్‌ను వారు నడిపిస్తున్నారు. సైబర్‌ నేరాలపై అవగాహన లేని అనేక మంది ఈ నేరాగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఫేస్‌బుక్‌ ఖాతాకు లాక్‌ వేయని వారు మాత్రమే సైబర్‌ నేరగాళ్లకు సులువుగా దొరుకుతున్నారు. హ్యాక్‌ చేసి డేటా చోరీ చేసిన అనంతరం ఖాతాను పూర్తిగా హ్యాకర్లే నడిపిస్తున్నారు.

ఒకసారి ఖాతా హ్యాక్‌ అయితే ఫోన్‌లోని ఫేస్‌బుక్‌ సమాచారంతో పాటు, వాట్సప్‌ కాంటాక్ట్‌ లిస్ట్, ఫోన్‌ కాంటాక్ట్‌లిస్ట్, గ్యాలరీలోని కుటుంబ సభ్యుల ఫొటోలతో సహా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. అసభ్యకరమైన ఫొటోలను ఖాతాలో పోస్ట్‌ చేయడం, మీరు అడిగినట్లే మీ బంధువులు, స్నేహితులను మెసేజ్‌ల ద్వారా డబ్బులు అప్పుగా అడగటం, అభ్యర్థించడం వంటివి చేస్తున్నారు. విషయం తెలుసుకోలేని కొందరు హ్యాకర్లకు లొంగిపోతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ తరహా ఘటనలపై గడిచిన 15 రోజుల్లో 12 కేసులు విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెలుగులోకి రాని కేసులు అనేకం ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. 

వెంటనే సంప్రదించండి
ఫేస్‌బుక్‌ అకౌంట్లకు లాక్‌ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫేస్‌బుక్‌ సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్‌ ఉంటుంది, దానిని ఉపయోగించి ఖాతాను భద్రంగా ఉంచుకోండి. ఫోన్‌కు వచ్చిన ప్రతి యుఆర్‌ఎల్‌ లింక్‌ను టచ్‌ చేయవద్దు. నకిలీ యుఆర్‌ఎల్‌ అని అనుమానం వచ్చిన వెంటనే పోలీసులను సంప్రదించండి. అకౌంట్‌ హ్యాక్‌కు గురైతే వెంటనే ఫిర్యాదు చేయండి. 
– బి.రాజారావు, ఎసీపీ, సైబర్‌క్రైం, విజయవాడ

Advertisement

తప్పక చదవండి

Advertisement