హైదరాబాద్‌: సూసైడ్‌ బెదిరింపును జోక్‌ అనుకున్న భర్త.. చివరికి పూజ నిజం చేసింది!

Committed Suicide Despite Being Told That She Would Commit Suicide - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని భర్తకు సెల్ఫీ తీసుకుని ఫొటో పెట్టిన స్పందించలేదని మనస్తాపానికి గురైన ఓ యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నేపాల్‌కు చెందిన రాజన్‌ పర్వార్, పూజ(19) దంపతులు ఏడాదిన్నర క్రితం నేపాల్‌ నుంచి నగరానికి వలసవచ్చారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 10 లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలోని ఓ ఇంట్లో పని చేస్తున్నారు.

రాజన్‌ కాపలాదారుగా పని చేస్తుండగా, పూజ  వంట పని చేసేది. టిక్‌టాక్‌లు చేస్తున్న పూజను రాజన్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా గత కొంత కాలంగా భర్త తనను పట్టించుకోవడం లేదని పూజ ఆరోపిస్తూ ఉండేది. అతను మరొకరితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని  సన్నిహితుల దృష్టికి తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో తనకు బతకాలని లేదంటూ ఇంటి యజమాని వద్ద కూడా వాపోయింది. ఆదివారం సాయంత్రం రాజన్‌ గేటు వద్ద విధుల్లో ఉండగా బాత్‌రూమ్‌లోకి వెళ్లిన పూజ మెడకు చున్నీ చుట్టుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సెల్పీ తీసి భర్తకు పంపింది.

అయితే రాజన్‌ ఆ ఫొటో చూసుకోలేదు. రెండు గంటలు గడిచినా భర్త స్పందించకపోవడంతో మనస్తాపానికి లోనైన ఆమె బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. భార్య ఎంతకూ బయటికి రాకపోయేసరికి అనుమానం వచ్చిన రాజన్‌ కిటికీలో నుంచి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఇంటి యజమాని సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెందింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు రాజన్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: తెలంగాణ: హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఐటీ సోదాలు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top