మమ్మీ,డాడీ  ఇక రారా అన్నయ్యా? 

Children Lost Their Parents In Nagarjuna Sagar - Sakshi

అమాయకంగా అడిగిన చిన్నారి  

ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న తల్లిదండ్రులు

నాగార్జునసాగర్‌: వారిది తెలిసీతెలియని వయస్సు.. తాము తల్లిదండ్రులను కోల్పోయామన్న స్పృహ వారికి లేదు. తల్లి అంత్యక్రియల సమయంలో.. అన్నయ్యా.. మమ్మీ, డాడీ ఎక్కడ? ఇక వారు ఇంటికి రారా?.. ఏమైందంటూ రెండేళ్ల చిన్నారి బరువెక్కిన హృదయంతో అమాయకంగా అడిగిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో నాగార్జునసాగర్‌కు చెందిన ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు వెన్నం రవికుమార్‌ (31) ఆత్మహత్య చేసుకోగా.. ఒకరోజు ముందు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అతని భార్య అక్కమ్మ (25) బుధవారం శవమై కనిపించింది. వివరాలు.. నందికొండ మున్సిపాలిటీలోని హిల్‌కాలనీకి చెందిన వెన్నం రవికుమార్‌ (31) పెద్దవూర మండలం తుమ్మచెట్టు తండాలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

పాఠశాలలు మూసివేయడంతో వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అక్కమ్మ సోమవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన రవికుమార్‌.. మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం గుంటూరు జిల్లా మాచర్ల మండలం తాళ్లపల్లి బుగ్గవాగు సమీపంలో కాల్వ ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఓ మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని అక్కమ్మదిగా గుర్తించారు. అక్కమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రోజే (సోమవారం) కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.  

అయ్యో.. పాపం 
రవికుమార్, అక్కమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. బాబుకు మూడేళ్లు, పాపకు రెండేళ్ల వయస్సు. గురువారం తల్లి అంత్యక్రియలు జరుపుతున్న సమయంలో పిల్లలను పక్కనే ఉంచారు. ఆ సమయంలో ‘అన్నయ్యా.. మమ్మి,డాడీ ఎక్కడ? అంటూ చిన్నారి అమాయకంగా అడగడంతో అక్కడున్న వారు చలించిపోయారు. దేవుడు చిన్న పిల్లలకు ఇదేమి పరీక్ష పెట్టాడంటూ కన్నీటిపర్యంతమయ్యారు.  

 చదవండి: భర్త వద్దకు తీసుకెళ్తానని చిత్రహింసలు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top