ప్యాట్నీ సెంటర్‌ ఎస్‌బీఐ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం | Blaze In Secunderabad Patny Centre SBI Admin Building | Sakshi
Sakshi News home page

ప్యాట్నీ సెంటర్‌ ఎస్‌బీఐ బిల్డింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం

May 4 2025 8:23 PM | Updated on May 5 2025 6:08 AM

Blaze In Secunderabad Patny Centre SBI Admin Building

కీలక ఫైళ్లు, ఫర్నిచర్‌ దగ్ఢం..

మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చిన అగ్ని మాపక సిబ్బంది

సనత్‌నగర్‌ (హైదరాబాద్‌): సికింద్రాబాద్‌ ప్యాట్నీ సెంటర్‌ వద్ద ఎస్‌బీఐ బ్యాంక్‌ అడ్మినిస్ట్రేషన్‌ భవనం నాలుగో అంతస్తులో ఆదివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతం వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అగ్నిమాపకశాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కొన్నిసార్లు ఆదివారం కూడా కొందరు సిబ్బంది కార్యాలయానికి వచ్చి కార్యకలాపాలు సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఆదివారం ఇద్దరు ఉద్యోగులు నాలుగో అంతస్తులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో ఒకరు అగ్ని ప్రమాదం జరగక మునుపే బయటకు వెళ్లిపోగా, మరొకరు అంతస్తులో దట్టమైన పొగలు వ్యాపించడంతో భయంతో బయటకు వచ్చేసినట్లు సమాచారం.

ఎగసిన మంటలతో భయాందోళన
ప్యాట్నీ సెంటర్‌ ప్రధాన రహదారిలో నగరానికి సంబంధించి ఎస్‌బీఐ అడ్మి నిస్ట్రేషన్‌ కార్యకలాపాలు ఇక్కడి నాలుగు అంతస్తుల భవనంలో కొనసాగు తాయి. నాలుగో అంతస్తులో లోన్ల విభాగం ఉంది. ఆ విభాగంలో ఆదివారం సాయంత్రం 7.30 గంటల సమయంలో ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో.. స్థానికులతో అటు ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. క్షణాల్లో అగ్నికీలలు అంతస్తు మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న సికింద్రాబాద్‌ అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 

మంటల తీవ్రత అధికంగా ఉండడంతో.. మల్కాజిగిరి, మౌలాలి ప్రాంతాల నుంచి మరో రెండు అగ్నిమాపక శకటాలను రప్పించారు. కాగా, ప్రమాదం జరిగింది నాలుగో అంతస్తులో కావడంతో.. భారీ క్రేన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా కష్టపడాల్సి వచ్చింది.  దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో కీలక ఫైళ్లు, పెద్ద ఎత్తున ఫర్నిచర్‌ దగ్ధమైనట్లు తెలుస్తోంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఉండే ఈ కార్యాలయంలో.. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద ప్రాణనష్టమే తప్పింది. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమై ఉండవచ్చని సికింద్రాబాద్‌ ఫైర్‌ అధికారి శ్రీనివాస్‌ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement