ఎమ్మెల్యే చల్లా ఇంటిపై దాడి.. అట్టుడికిన వరంగల్‌

BJP Cadre Attacks Residence Of Parkal MLA - Sakshi

రాముడిపై వ్యాఖ్యలతో బీజేపీ ఆగ్రహం..

ఎమ్మెల్యే ఇంటిపై రాళ్ల దాడి

ప్రతిగా బీజేపీ కార్యాలయంపై టీఆర్‌ఎస్‌ శ్రేణుల ఎదురుదాడి

ఆందోళనలు, దాడులతో వరంగల్‌ నగరంలో ఉద్రిక్తత

ధర్మారెడ్డి ఇంటిని సందర్శించిన మంత్రి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు

సాక్షి, హన్మకొండ: బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణలతో వరంగల్‌ నగరం ఆదివారం అట్టుడికిపోయింది. హన్మకొండ నక్కలగుట్టలోని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం ముట్టడించి దాడి చేయగా.. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలోనే హంటర్‌రోడ్డులోని బీజేపీ కార్యాలయంపై టీఆర్‌ఎస్‌ నేతలు దాడి చేశారు. ఇటు సుబేదారి పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకుని స్టేషన్‌ ఎదుట ఉన్న బీజేపీ నేతల వాహనాలను ధ్వంసం చేశారు. 

చల్లా వ్యాఖ్యలతో దుమారం..
ఇటీవల రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు బీజేపీ శ్రేణులు దొంగ బుక్కులు తయారు చేసుకుని చందాలు వసూలు చేస్తున్నారంటూ పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం హన్మకొండ నక్కలగుట్టలోని ఆయన ఇంటిని ముట్టడించారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు రోప్‌పార్టీతో అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నా ప్రతిఘటించి దూసుకుపోయారు. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా నెట్టేయడంతో కొందరు అక్కడే బైఠాయించారు. వెనుక వైపు నుంచి కొందరు ధర్మారెడ్డి ఇంటిపైకి కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి.


టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన బీజేపీ కార్యాలయ సామగ్రి 

పోలీసులు అడ్డుకోగా వారి లాఠీలను లాక్కొని ఇంటిపైకి విసిరారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో దాడికి పాల్పడిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి హన్మకొండలోని సుబేదారి, కాకతీయ యూనివర్సిటీ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఇటు బీజేపీ దాడులకు ప్రతిగా టీఆర్‌ఎస్‌ నేతలు హన్మకొండ హంటర్‌రోడ్డులోని బీజేపీ కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా వేద బాంక్వెట్‌ హాల్‌ ఎదుట ఉన్న తోరణాన్ని ధ్వంసం చేశారు. ఇటు సుబేదారి పోలీసుస్టేషన్‌ వద్దకు చేరుకుని స్టేషన్‌ ఎదుట ఉన్న బీజేపీ నేతల వాహనాలపై దాడులు చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సిద్ధం నరేశ్‌ కారు అద్దాలు పగులకొట్టారు. 

దీక్ష చేపట్టిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు..
టీఆర్‌ఎస్‌ నేతల చర్యను నిరసిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో దీక్ష చేపట్టారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధిగా ఉండి క్షుద్ర పూజలు చేసే మీకు అవతార పురుషుడైన రాముడి గురించి ఏమి తెలుసని ధర్మారెడ్డిని ప్రశ్నించారు. రామ మందిర నిర్మాణానికి భక్తులు సమర్పించే ప్రతి పైసకూ లెక్క ఉందని చెప్పారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న బీజేపీ నేతలను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సుబేదారి పోలీసు స్టేషన్‌ ఎదుట బీజేపీ శ్రేణులు ధర్నా చేశారు. ఆదివారం రాత్రి పెద్ద ఎత్తున స్టేషన్‌కు చేరుకున్న నాయకులు, కార్యకర్తలు అక్కడే బైఠాయించారు. రాత్రి 10.20 గంటల వరకు కూడా ధర్నా కొనసాగింది. ఇటు ఎమ్మెల్యే చల్లా ఇంటిపై జరిగిన దాడి ఘనటనపై సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మతో పాటు ఇతర నేతలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

నేతల పరామర్శ
చల్లా ఇంటిపై బీజేపీ దాడి ఘటన సమాచారం తెలుసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు తదితరులు ఆయన ఇంటికి చేరుకుని పరిశీలించారు. చల్లా కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇదిలాఉండగా.. వరంగల్‌ పోలీసు కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ చల్లా ఇంటికి చేరుకుని పరిశీలించారు. పోలీసు ఏసీపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top