Chandrayangutta: కంట్లో కారం చల్లి.. కత్తులతో పొడిచి..

Auto Driver Brutally Murdered Old Quarrels At Chandrayangutta - Sakshi

చాంద్రాయణగుట్ట: పాత గొడవల నేపథ్యంలో ఓ ఆటోడ్రైవర్‌ దారుణ హత్యకు గురైన  సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు....తలాబ్‌కట్టకు చెందిన మహ్మద్‌ షాకీర్‌(30) ఆటోడ్రైవర్‌గా పని చేస్తూ భార్యతో పాటు ఇద్దరు పిల్లలతో సహా హఫీజ్‌బాబానగర్‌లో నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం అతను ఆటోలో బ్యాటరీల లోడ్‌ తీసుకుని బాలాపూర్‌ నుంచి చాంద్రాయణగుట్టకు  వస్తున్నాడు.

డీఎల్‌ఆర్‌ఎల్‌ గేట్‌ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ఇబ్రహీం అతని  స్నేహితులు ఆటోను అడ్డుకుని షాకీర్‌ కళ్లల్లో కారం చల్లారు. వెంటనే కత్తితో అతని మెడ, ఛాతిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితులు పరారయ్యారు. రోడ్డుపై ఆగి ఉన్న ఆటోలో  రక్తపు మడుగులో పడిఉన్న షాకీర్‌ను గుర్తించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. ఫలక్‌నుమా ఏసీపీ షేక్‌ జహంగీర్, చాంద్రాయణగుట్ట  ఇన్‌స్పెక్టర్‌ కె.ఎన్‌.ప్రసాద్‌ వర్మ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే. 
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే షాకీర్‌ను ఇబ్రహీం హతమార్చినట్లు సమాచారం. అప్పుల బాధ తాళలేక  గతంలో షాకీర్‌ బెంగుళూర్‌ వెళ్లాడు. దీనిని  అదునుగా చేసుకుని ఇబ్రహీం షాకీర్‌ భార్యతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. బెంగుళూర్‌ నుంచి తిరిగొచ్చిన షాకీర్‌ విషయం తెలుసుకొని ఇబ్రహీంతో గొడవ పడ్డాడు. అప్పట్లోనే కత్తులతో దాడులకు దిగగా స్నేహితులు అడ్డుకున్నారు. ఎప్పటికైనా చంపేస్తానంటూ షాకీర్‌ హెచ్చరించాడు. వివాహేతర సంబంధానికి  అడ్డుగా ఉండడం...ఇటు చంపుతాడేమోన్న భయంతోనే  ఈ హత్యకు ఒడిగట్టినట్లు తెలిసింది. నిందితులను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదపులోకి తీసుకున్నారు.

(చదవండి: భార్యను కత్తితో నరికి... మృతదేహానికి పూలమాల వేసి...)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top