బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడికి యావజ్జీవం 

Accused gets life for Molestation on girl by POCSO COURT - Sakshi

గుంటూరు లీగల్‌: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి పోక్సో కోర్టు న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.3,500 జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. బాలిక తల్లితో కలిసి దుర్గి మండలంలోని ఓ గ్రామంలో నివసిస్తున్నారు. స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి పూర్తి చేసుకుని నాలుగో తరగతిలో చేరాల్సి ఉంది.

ఈ క్రమంలో దుర్గిలో నివాసం ఉంటున్న అత్త ఇంటికి వెళ్లి వస్తానని తల్లికి చెప్పడంతో అదే గ్రామంలో ఉంటున్న ఆటో డ్రైవర్‌ కామ రామన్జీ అలియాస్‌ అంజితో మాట్లాడి ఆటో ఎక్కించి పంపించింది. అంజి బాలికను మొక్కజొన్న పొలం వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత బాలికను బంధువుల ఇంటి వద్ద దింపాడు. బాలిక అనారోగ్యంగా ఉండటంతో అదే రోజు సాయంత్రం తల్లి వద్దకు వచ్చేసింది.

అంజి బెదిరింపులకు భయపడి తల్లికి విషయం చెప్పలేదు. అయితే 2018, మే 12న తల్లి యథావిధిగా పొలం పనులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఎప్పుడూ ఇంటి పనులు చేసే బాలిక చేయకుండా నీరసంగా కనిపించడంతో ఏం జరిగిందని అడుగ్గా, గతంలో తనపై జరిగిన లైంగిక దాడి విషయా­న్ని చెప్పింది.

వెంటనే తల్లి దుర్గి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఏఎస్పీ కె.జి.వి.సరిత దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.

నిందితుడు అంజిపై నేరం రుజువు కావడంతో పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.సీతారామకృష్ణారావు పైవిధంగా తీర్పు చెప్పారు. కోర్టు విచారణ సమయంలో బాలిక మృతి చెందింది. బాలిక కుటుంబానికి రూ.4 లక్షలు నష్ట పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ శ్యామల కేసు వాదించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top