కోట్లకు పడగెత్తిన పంచాయతీ కార్యదర్శి: ఆస్తి ఎంతో తెలిస్తే షాక్‌!

ACB Raids Srikakulam Pydibhimavaram Panchayat Secretary House - Sakshi

ఏకకాలంలో పలుచోట్ల ఏసీబీ సోదాలు

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో పనిచేస్తున్న వెంకటరావు 

35 లక్షల నగదు, 669 గ్రాముల బంగారం, 2.5 కిలోలు వెండి, డాక్యుమెంట్లు స్వాధీనం

మార్కెట్‌ ధర ప్రకారం ఆయన ఆస్తులు 50 కోట్లు పైమాటే..

విశాఖ క్రైం: శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం పంచాయతీ కార్యదర్శి, రణస్థలం మండలంలో గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆగూరు వెంకటరావు ఇంటిపై శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న సమాచారం మేరకు అతనితో పాటు కుటుంబ సభ్యుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ డీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి ఆధ్వర్యంలో సిబ్బంది శ్రీకాకుళం, విజయనగరంతో పాటు విశాఖలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో రూ.35,67,100 నగదు, రూ.17,65,373 విలువైన 669 గ్రాముల బంగారు ఆభరణాలు, విలువైన భూముల డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

కాగా శ్రీకాకుళం జిల్లా అరసాడ గ్రామానికి చెందిన ఆగూరు వెంకటరావు విలేజ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా విధుల్లో చేరారు. అక్కడ నుంచి ప్రస్తుతం గ్రేడ్‌–1 పంచాయతీ కార్యదర్శిగానే కాకుండా ఇన్‌చార్జి ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో వారు నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో శుక్రవారం ఉదయం 6.30 గంటలకు విజయనగరం, రాజాం, నెల్లిమర్ల ప్రాంతాల్లో ఉన్న వెంకటరావుతో పాటు అతని కుటుంబ సభ్యుల నివాసాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. విశాఖలోని రామా టాకీస్‌ డౌన్‌లోని వెజిటబుల్‌ మార్కెట్‌ దరి సువర్ణ రెసిడెన్సీలో రెండో అంతస్తులో వెంకటరావు నివాసం ఉంటున్న 202 ప్లాట్‌లో అధికారులు సోదాలు చేశారు. 

ఈ క్రమంలో అక్రమాస్తుల విలువ రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలిపారు. అయితే అతని ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్‌ ధర సుమారు రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ భాస్కర్‌రావు, హరి, మహేష్, ఎస్‌ఐ చిన్నంనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, ఆగూరు వెంకటరావును అరెస్ట్‌ చేసినట్టు శ్రీకాకుళం ఏసీబీ డీఎస్పీ డీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి తెలిపారు. అతన్ని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలిస్తామన్నారు. 

చదవండి: ఏసీబీకి పట్టుబడిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్
మానవత్వం చూపించిన వీఆర్వో

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top