కుత్బుల్లాపూర్‌: ఆరు రోజులాయె.. అతనెక్కడా..?

6 Days Of 54 Years Man Goes Missing In Quthbullapur, After Falling Into Open Drain - Sakshi

అనుమానాస్పదంగా నాలాలో పడి వ్యక్తి అదృశ్యం

పలు కోణాల్లో గాలింపు ముమ్మరం

రోజులు గడుస్తుండటంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన

సాక్షి, కుత్బుల్లాపూర్‌: నాలాలో పడి గల్లంతైన వ్యక్తి జాడ ఆరు రోజులు గడుస్తున్నా లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్‌ 25వ తేదీన రాత్రి 7 గంటలకు కుత్బుల్లాపూర్‌ గ్రామంలోని సీపీఆర్‌ కాలనీలోని తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మోహన్‌రెడ్డి స్థానికంగా ఉన్న రాయల్‌ వైన్స్‌లో తన తోటి స్నేహితులు మురళికృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డిలతో మద్యం సేవించి ఇంటికి బయల్దేరుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే భయంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన తోటి స్నేహితులు మరుసటి రోజు వరకు కుటుంబ సభ్యులకు తెలుపకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.

దీంతో 26వ తేదీ ఆదివారం సాయంత్రం జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించిన మోహన్‌రెడ్డి భార్య భార్గవి తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపడుతున్న ఈ క్రమంలో వైన్స్‌ దుకాణం వద్ద జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పటికే నాలాలో పడి అదృశ్యమైన మోహన్‌రెడ్డి ఆచూకీ దొరకడం కష్టంగా మారింది. 
చదవండి: ఘరానా దొంగ: కారులో రెక్కీ.. ఇళ్లలో చోరీ

కొంపముంచిన కక్కుర్తి... 
► కుత్బుల్లాపూర్‌ గ్రామంలోని నాలాకు ఆనుకొని ఉన్న రాయల్‌ వైన్స్‌ నిర్వాహకుల కక్కుర్తి వల్ల వ్యక్తి అదృశ్యానికి కారణమైంది. వైన్స్‌ షాప్‌లో లభ్యమయ్యే వ్యర్థాలను పడేసే విధంగా గ్రేటర్‌ అధికారులు ఏర్పాటు చేసిన కంచెను తొలగించారు. గత రెండేళ్లుగా ఇదే తరహాలో చెత్తను వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మద్యం సేవించి ఇంటికి వెళ్తున్న మోహన్‌రెడ్డి అకస్మాత్తుగా నాలాలో పడి కొట్టుకుపోవడం ఈ విషయం హాట్‌ టాపిక్‌గా మారింది. 

► అంతేకాకుండా కేసు విషయాలను తెలుసుకునేందుకు గురువారం కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత సర్కిల్‌ ఉప కమిషనర్‌ మంగతాయారు ముందే చెత్త వేస్తున్న విషయాన్ని గుర్తించి రూ.లక్ష జరిమానా వేయడం విశేషం. 
చదవండి: ఉన్నతాధికారులతో పరిచయాలు.. రూ. 10 కోట్లతో వ్యాపారి అదృశ్యం

బాధ్యులెవరు..? 
►సెప్టెంబర్‌ 25వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మోహన్‌ రెడ్డి సమీపంలో ఉండే స్నేహితులు మురళీకృష్ణారెడ్డి, వెంకట్‌ రెడ్డి ముగ్గురు కలిసి మద్యం షాప్‌కు వెళ్లారు. 
► అదే రోజు రాత్రి మోహన్‌రెడ్డి నాలాలో పడి గల్లంతవ్వగా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయారు. సంఘటన జరగగానే ఈ విషయాన్ని కుటుంబ  సభ్యులకు అటు పోలీసులకు చెప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 
►  సమీపంలో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా గమనిస్తే మోహన్‌రెడ్డి జారిపడుతున్న క్రమంలో పక్కనే మరో వ్యక్తి అక్కడి నుంచి వెళ్తున్న దృశ్యం పోలీసులు గుర్తించారు. 
► కాగా కింద పడే క్రమంలో ఎవరైనా తోసేశారా? లేదా ప్రమాదవశాత్తు పడిపోయాడా? అన్న విషయంపై స్పష్టత కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 
► మూడు రోజుల తర్వాత మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. 
►  శనివారం రాత్రి వర్షం ఓ మోస్తరుగా ఉండగా ఆదివారం సోమవారం కుండపోత వర్షం పడింది. 
►  ఈ క్రమంలో గల్లంతైన మోహన్‌ రెడ్డి అందులో కొట్టుకుపోయి ఉంటాడని బీఆర్‌ఎఫ్‌ బృందం సభ్యులు తెలిపారు. 

జల్లెడ పడుతున్న పోలీసులు... 
► మోహన్‌రెడ్డి ఆచూకీ కోసం జీడిమెట్ల సీఐ బాలరాజు నేతృత్వంలో బీఆర్‌ఎఫ్‌ బృందం కుత్బుల్లాపూర్, వెంకటేశ్వరనగర్, గణేష్‌నగర్, పాపయ్యయాదవ్‌ నగర్, హెచ్‌ఏఎల్‌ కాలనీ, బాలానగర్‌ తదితర ప్రాంతాల వరకు విస్తరించి ఉన్న నాలా వెంట గాలింపు ముమ్మరం చేశారు. 
► ఇదే విషయంపై కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌ మమత తమ సిబ్బందితో గాలింపులో పాల్గొన్నారు. 
► విషయాన్ని గోప్యంగా ఉంచడం మూలంగా అతడి ఆచూకీ కనుక్కునే పరిస్థితి ఈ విషయంలో జాప్యం జరుగుతుందని ఇన్‌స్పెక్టర్‌ బాలరాజు ‘సాక్షి’తో అన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top