ఘరానా దొంగ: కారులో రెక్కీ.. ఇళ్లలో చోరీ

Man House Robbery Mystery In Adilabad - Sakshi

సాక్షి, మంచిర్యాల(ఆదిలాబాద్‌): కుటుంబ పోషణ కోసం ఏర్పాటు చేసుకున్న కిరాణం సరిగా నడవలేదు. వచ్చిన డబ్బు జల్సాలు, కుటుంబ పోషణకు సరిపోలేదు. దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. కారులో రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడుతున్నాడు. ఐదు రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన దొంగను మంచిర్యాల పోలీసులు ఎట్టకేలకు కటకటాల్లోకి నెట్టారు. రూ.9.21లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.30వేల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.

శుక్రవారం మంచిర్యాల పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ అఖిల్‌మహాజన్‌ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కేసనపల్లి గ్రామానికి చెందిన రాయపాటి వెంకయ్య చిన్నతనంలోనే తల్లిదండ్రులు అనారోగ్యంతో చనిపోయారు. అయిన వాళ్లు ఎవరూ చేరదీయకపోవడంతో కొరటిపాడు పట్టణంలోని కిరాణ దుకాణంలో నెల జీతానికి కొంతకాలం పని చేశాడు.

ఆ తర్వాత సొంతంగా కిరాణం దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగించాడు. దుకాణం సరిగా నడవకపోవడం, జల్సాలకు అలవాటు పడడం, వచ్చిన డబ్బులు కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని దొంగతనాలను ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, పాలకొల్లు, భీమవరం ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో, బైక్‌ దొంగతనాలు చేశాడు.

2008 రాజమండ్రి పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లాడు. అక్కడ కొందరితో పరిచయాలు ఏర్పర్చుకుని విడుదలైన తర్వాత నెల్లూరు, తిరుపతి ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. 2009లో పోలీసులు మరోసారి నెల్లూరు సెంట్రల్‌జైలుకు పంపించారు. ఆరు నెలల జైలు శిక్షణ అనంతరం దొంగతనాలకు పాల్పడగా.. తెలంగాణ రాష్ట్రంలో 19, ఆంధ్రప్రదేశ్‌లో 71, కర్ణాటకలో 4, కేరళలో 1, తమిళనాడు రాష్ట్రంలో 5 కేసులు నమోదయ్యాయి.

ఐదు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా మారిన వెంకయ్య జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, సీసీసీ నస్పూర్, శ్రీరాంపూర్, కరీంనగర్‌లో వరుస చోరీలకు పాల్పడ్డాడు. 
కారులోనే చోరీ సొత్తు వెంకయ్య ఉరఫ్‌ వెంకటేష్‌ ఒక్కడే లేదా జైల్లో పరిచయమైన దొంగ స్నేహితులతో కలిసి కారులో తిరుగుతూ పగలు రెక్కీ నిర్వహించేవాడు. తాళం వేసి ఉన్న ఇళ్లను గమనిస్తూ రాత్రి వేళ చోరీలకు పాల్పడేవాడు.

కారులో కత్తులు, వేటకొడవళ్లు, స్క్రూడైవర్, ఇనుప రాడ్లు ఉండవి. ఎవరైనా అడ్డుకుంటే వాటితో దాడి చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. చోరీ సొత్తును కారులోనే దాచి ఉంచుతూ పెద్దమొత్తంలో ఒకేసారి విక్రయించేవాడు. సొత్తు అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సా చేసేవాడు.

దొంగతనానికి వెళ్తూ..
చోరీ సొత్తును కారులోనే ఉంచి బెల్లంపల్లిలో మరో దొంగతనానికి కారు (ఏపీ28డీఎం 6110)లో వెళ్తుండగా ఏసీసీ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. పోలీసులను చూసి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. 424.3 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి, రూ.30వేలు నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. చోరీ సొత్తు విలువ రూ. 9.21లక్షలు ఉంటుందని, ఐదు వేట కొడవళ్లు, రెండు కత్తులు లభించాయని ఏసీపీ వెల్లడించారు. మంచిర్యాల సీసీఎస్‌ పోలీసులు, స్థానిక సీఐ నారాయణ్‌నాయక్, సీసీఎస్‌ సీఐ, ఎస్సైలను అభినందించి నగదు రివార్డులు అందజేశారు.  

చదవండి: ఆర్‌ఎంపీ క్లినిక్‌లో దారుణం.. తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top