చిత్తూరు కలెక్టరేట్ : ప్రతిభావంతులైన షెడ్యూల్డ్ కులాలు, డి.నోటిఫైడ్ తెగలకు (డీఎన్‌టీ–ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల పరిధిలోకి రానివారు) చెందిన బాలబాలికలకు ప్రైవేటు రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించనున్నారు. ఇందుకు శ్రేష్ట అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంలో 9వ తరగతి, 11వ తరగతిలో ప్రవేశాలకు విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. విద్యకు అయ్యే మొత్తం ఖర్చును కేంద్రం భరిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఈ పథకానికి అర్హులైన విద్యార్థులు Šbèlxa-m-r. nta. ni-c.i n, nt-a.-ac.i n అనే వెబ్‌సైట్‌లలో ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 30, డిసెంబరు 1న నిర్వహించాలని, లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్లు అందజేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 30న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బ్యాంకుల నుంచి నగదు తీసుకుని అదే రోజు పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎవరైనా మిగిలిపోతే డిసెంబరు 1న ఇవ్వాలని, ఈ మేరకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలో నిర్దేశించిన ధరలకే నిత్యావసర సరుకులు విక్రయించాలని, కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ హెచ్చరించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. సామాన్య ప్రజలపై భారం పడకుండా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తక్కువ ధరలకు బియ్యం అందుబాటులో ఉండేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలన్నారు. రైతులు నేరుగా వినియోగదారులకు కూరగాయలు విక్రయించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రైతుబజార్లలో మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించడం ద్వారా రైతులకు ప్రయోజనం కలగడంతోపాటు వినియోగదారులకు మేలు జరుగుతుందని జాయింట్ కలెక్టర్ వెల్లడించారు.
కాణిపాకంలో ముగిసిన పవిత్రోత్సవాలు
కాణిపాకం: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శనివారం ముగిశాయి. ఆలయ ప్రధాన కల్యాణ వేదిక వద్ద చివరి రోజు పూజల్లో భాగంగా ఉదయం నుంచి అవభృధ యాగం, స్తండీల మండలేశ్వర పూజ, మహా పవిత్ర సమర్పణ, విశేష ద్రవ్యాహుతి, మహా పూర్ణాహుతి, కుంభ చండయాగం తదితర వైదిక కార్యక్రమాలను అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామివారికి స్తవనాభిషేకం జరిపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, బోర్డు సభ్యుడు సుధాకర్ రెడ్డి, సూపరింటెండెంట్లు వాసు, కోదండపాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు బాలాజీ నాయుడు, రవి తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీలో చైర్‌పర్సన్ తనిఖీ
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా పరిషత్ కార్యాలయంలోని వ్యవస్థాపక, ప్రణాళిక, విద్య, పెన్షన్, పీఎఫ్, డీపీఆర్సీ, పీఆర్‌ఎస్‌ఐ, పీఐయూ విభాగాలను శనివారం జెడ్పీ చైర్‌పర్సన్ శైలజ తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఇంజినీరింగ్ విభాగంలోని అధికారుల కార్యకలాపాలపై ఆరా తీశారు. జెడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు ఆమెకు అధికారులు, సిబ్బంది విధుల గురించి వివరించారు.
అప్పుడు అత్త అటెండర్..
నేడు కోడలు చైర్ పర్సన్
చిత్తూరు కార్పొరేషన్ : చిత్తూరు జిల్లా రాజకీయా ల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జెడ్పీ కార్యాలయంలో అత్త అటెండర్ పనిగా పనిచేసిన కోడలు నేడు జెడ్పీ చైర్‌పర్సన్ అయ్యారు. వివరాల్లోకి వెళితే ఓ విద్యా సంస్థల అధినేత తేజోమూర్తి తండ్రి మునస్వామినాయుడు పీఆర్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ మరణించారు. భార్య అచ్చమ్మకు కారుణ్య నియామకం కింద 1989లో అటెండర్ ఉద్యోగం ఇచ్చారు. ఆమె 2006లో ఉద్యోగ విరమణ చేశారు. ప్రస్తుతం తేజోమూర్తి భార్య శైలజ జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈ అరుదైన పరిణామం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.


