174 పంచాయతీలు, 317 కేంద్రాల్లో పోలింగ్ 1,100 మంది పోలీసులతో భద్రత, డ్రోన్లతో నిఘా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదు జిల్లా ఎస్పీ తుషార్ డూడి హెచ్చరిక
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో రెండవ విడత గ్రామ సర్పంచ్ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. చిత్తూరు, నగరి, పలమనేరు సబ్ డివిజన్ల పరిధిలోని 10 మండలాలు, 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న 174 గ్రామ పంచాయతీలు, 317 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. అత్యంత సమస్యాత్మకమైన 66, సమస్యాత్మకమైన 92, సాధారణ 159 పోలింగ్ కేంద్రాలను గుర్తించి 1,100 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. డ్రోన్ల ద్వారా పోలింగ్ కేంద్రాలు, గ్రామాలను పర్యవేక్షించడంతో పాటు రూట్ మొబైల్, స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను సిద్ధం చేశామన్నారు. ఓటర్లను నగదు, మద్యంతో ప్రలోభపెట్టినా, భయపెట్టినా, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వదంతులు, విద్వేషపూరిత పోస్టులు పెట్టే వారిపై సైబర్ నిఘా ఉందని స్పష్టం చేశారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సహాయం అందిస్తామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 లేదా పోలీస్ వాట్సాప్ నంబర్ 9440900005ను సంప్రదించాలని, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.


