●
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో పసికందులు అనాథలుగా దొరుకుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలను లోతుగా పరిశీలిస్తే చేదు నిజయం బయటపడుతోంది. వదిలివేస్తున్న శిశువుల్లో అత్యధిక శాతం ఆడపిల్లలే ఉండడం గమనార్హం. మహిళలు అంతరిక్షంలోకి దూసుకెళ్తున్నా నేటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆడబిడ్డ పుడితే భారంగా భావించే దుస్థితి పోలేదు. వీటికితోడు వివా హేతర సంబంధాలు, యువతలో పెరుగుతున్న అపరిక్వత, అవాంఛిత గర్భాలు, పేదరికం, కుటుంబ పోషణ భారం వంటి కారణాలు కన్నవారిని నిర్దయులుగా మారుస్తున్నాయి. పరువుకు భయపడో, బాధ్యతల నుంచి తప్పుకోవడానికో అభం, శుభం తెలియ ని పసికందులను చెత్తకుప్పల పాలు చేస్తున్నారు.
ఆడపిల్లల పట్ల వివక్ష
ఇప్పటికీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వారసుడి కోసం ఆరాటపడుతూ ఆడపిల్ల పుడితే భారంగా భావించే ధోరణి కనిపిస్తోంది. వరుసగా ఆడపిల్లలు పుట్టడం వల్ల పెళ్లి, కట్నకానుకల భయంతో పసికందులను వదిలించుకుంటున్నారు. దీనికితోడు యువతలో పెరుగుతున్న అపరిపక్వత, వివాహేతర సంబంధాల కారణంగా గర్భం దాల్చిన వారు సమాజంలో పరువు పోతుందనే భయంతో రహస్య ప్రసవాలు చేసుకుని శిశువులను వదిలేస్తున్నారు.
పేదరికం, కుటుంబ కలహాలు
తాగుడుకు బానిసైన భర్తలు, ఆర్థిక భారం మోయలేని నిరుపేద మహిళలు పసికందుల పోషణ భారమై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బిడ్డను పెంచలేని పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వ శిశు గృహాలకు అప్పగించవచ్చనే అవగాహన లేకపోవడం, అవగాహన కల్పించడంలో సంబంధిత శాఖలు దృష్టి పెట్టకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొంటున్నట్టు పలువురు చెబుతున్నారు.
నిరుపయోగంగా ఊయల కేంద్రాలు
బిడ్డలను పెంచలేని నిస్సహాయ స్థితిలో ఉన్న తల్లిదండ్రులు వారిని అనాథలుగా పడేయకుండా ఉండేందుకు అధికారులు ఊయల కేంద్రాలను ప్రారంభించారు. జిల్లాలో ఆ కేంద్రాలు ఎక్కడా జాడలేకుండా పోయాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జిల్లా ప్రధాన ఆసుపత్రి, ప్రాంతీయ ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా బాలల సంరక్షణ విభాగం కార్యాలయాల వద్ద ప్రత్యేకంగా ఊయల కేంద్రాలను ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులు తమ వివరాలు ఎవరికీ తెలియకుండా బిడ్డను ఆ ఊయలలో ఉంచి వెళ్లిపోయేలా ఏకాంత ప్రదేశంలో వీటిని పెట్టాలి. బిడ్డను ఊయలలో ఉంచిన నిమిషం వ్యవధిలోనే సిబ్బందికి, సంరక్షులకు అలారం మోగేలా సెన్సార్ వ్యవస్థ ఉండాలి. జిల్లాలో ఆ ఊయలలు కనిపించడం లేదు. ఉన్న ఒకటి, రెండు చోట్ల కనీస నిర్వహణ లేక, పర్యవేక్షణ కొరవడి అలంకారప్రాయంగా మారాయి.
ఊయల కేంద్రాలు విఫలమయ్యేందుకు ప్రధాన కారణాలు
ఊయల కేంద్రాలను జనం రద్దీ ఉండే ప్రవేశ ద్వారాల వద్ద, సీసీ కెమెరాల నిఘా నీడలో ఏర్పాటు చేయడం వల్ల బిడ్డను వదిలి వెళ్లడానికి వచ్చే వారు భయపడుతున్నట్లు తెలిసింది. తమను గుర్తుపడుతారనే ఆందోళనతో ఊయల కేంద్రాల వైపు రాకుండా బయట పడేస్తున్నారని తేలింది. దీనికితోడు బిడ్డను ఊయలలో పెట్టిన వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసే అలారం వ్యవస్థ చాలా చోట్ల మరమ్మతులకు గురవ్వడం, రాత్రి వేళల్లో పర్యవేక్షించే ప్రత్యేక సిబ్బంది లేకపోవడంతో పసికందుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అసలు జిల్లాలో ఊయల కేంద్రాలు ఉన్నాయనే విషయం గ్రామీణ ప్రజలకు, సామాన్యులకు తెలియడం లేదు. దీనిపై అవగాహన కల్పించాల్సిన జిల్లా శిశు, సంక్షేమ శాఖ పూర్తిగా విఫలమైంది.
ముళ్లపొదల్లో మృత్యువుతో పోరాటం
పలమనేరు మండలంలోని ఓ గ్రామ శివారులో ఉన్న ముళ్లపొదల్లో ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి పడేసిన రెండు రోజుల ఆడశిశువును 2025 నవంబర్ 22న కుక్కలు పీక్కుతినేందుకు ప్రయత్నిస్తుండగా అటుగా వెళ్తున్న గొర్రెల కాపరులు గమనించి కాపాడారు. తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారికి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వారం రోజుల పాటు చికిత్స అందించారు. విచారణలో అవివాహిత యువతి సామాజిక భయంతో ప్రసవమైన వెంటనే బిడ్డను వదిలించుకున్నట్లు వెల్లడైంది.
ముళ్లపొదల్లో నవజాత ఆడశిశువు
నిండ్ర మండలం ఎంఎస్‌వీఎంపురం పంచాయతీలోని అమ్మయప్పర్ కంపెనీ సమీపంలోని ముళ్లపొదల్లో 2026 నవంబర్ 23న అప్పుడే జన్మించిన ఓ ఆడశిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ప్రస్తుతం ఆ చిన్నారి శిశు సంక్షేమ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉంది.
చెత్తకుప్పలో చిట్టితల్లి ఆర్తనాదాలు
చిత్తూరు నగరంలోని ఒక ప్రధాన ఆసుపత్రి వెనుక ఉన్న చెత్తకుప్ప వద్ద 2026 మే 14న ఉదయం 6:30 గంటల సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరిస్తుండగా సంచిలోంచి చిన్నారి ఏడుపు వినిపించింది. తెరిచి చూడగా అప్పుడే పుట్టిన ఆడశిశువు, బొడ్డుతాడు కూడా సరిగ్గా కత్తిరించని స్థితిలో చీమలు కుడుతూ కనిపించింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి.
రైల్వే స్టేషన్ బెంచీపై వదిలేసిన కన్నతల్లి
కుప్పం రైల్వే స్టేషన్ రెండో ప్లాట్‌ఫారమ్‌పై 2025 జూలై 9న నాలుగు నెలల పసివాడిని ఓ మహిళ పడుకోబెట్టి, బాత్రూమ్‌కు వెళ్లి వస్తానని పక్కనున్న ప్రయాణికులకు చెప్పి పరారైంది. ఆమె తిరిగి రాకపోవడంతో రైల్వే పోలీసులు చిన్నారిని శిశుగృహానికి అప్పగించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల కారణంగానే కన్నతల్లి బిడ్డను వదిలేసి వెళ్లినట్లు విచారణలో తేలింది.
కాలువ గట్టున విగతజీవిగా పసికందు
నగరి పట్టణ శివారులోని నీటి కాలువ గట్టున 2024 అక్టోబర్ 18న ఉదయం వస్త్రంలో చుట్టి పడేసిన అప్పుడే పుట్టిన మగశిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. చలి తీవ్రతకు, సకాలంలో వైద్యం అందక ఆ పసికందు ప్రాణాలు కోల్పోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.
అమ్మా అని పిలువకముందే ఆ గొంతును నొక్కేస్తున్నారు. లోకం పోకడ తెలియక ముందే కర్కశత్వానికి బలిచేస్తున్నారు. నవమాసాలు మోసి, పురిటి నొప్పులు భరించి జన్మనిచ్చిన కన్నతల్లులే కన్నపేగులను చెత్తకుప్పలు, ముళ్లపొదలు, రైల్వే ట్రాకుల పక్కన, ఆస్పత్రుల్లో నిర్ధాక్షిణ్యంగా వదిలేసి వెళ్లిపోతున్నారు. ఈ ఘటనల్లో అత్యధికంగా ఆడశిశువులే ఉండడం సమాజంలో లింగ వివక్ష ఏ స్థాయిలో ఉందో కళ్లకు కడుతోంది.
పసి పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దు
బిడ్డలను వదిలించుకోవాలకునే తల్లిదండ్రులు వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఊయల కేంద్రాల్లో బిడ్డలను సురక్షితంగా అప్పగిస్తే, వారి వివరాలను గోప్యంగా ఉంచి ప్రభుత్వమే పెంచి పోషిస్తుంది. ఊయల కేంద్రాలపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైనా అనాథ శిశువులు కనిపిస్తే వెంటనే 1098(చైల్డ్‌లైన్), 112 నంబర్లకు సమాచారం అందించాలి.
– శ్యామసుగుణకుమారి, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ శాఖ అధికారిణి, చిత్తూరు.
చట్టం ఏం చెబుతోందంటే
భారత న్యాయ సంహిత(బీఎన్‌ఎస్) సెక్షన్ 93 (గతంలో ఐపీసీ సెక్షన్ 317) ప్రకారం 12 ఏళ్లలోపు ఉన్న బిడ్డలను తల్లిదండ్రులు, సంరక్షకులు పూర్తిగా వదిలేయాలనే ఉద్దేశంతో నిర్మానుష్య ప్రదేశాల్లో విడిచి పెట్టడం తీవ్రమైన నేరం. ఇందుకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష, జరిమాన, రెండూ విధించే అవకాశం ఉంది. శిశువు మరణానికి కారణమైతే హత్యా నేరం కింద కఠిన శిక్షలు పడతాయి.


