ఆ 31,471 ఓటర్లు ఏమయ్యారు? | - | Sakshi
Sakshi News home page

ఆ 31,471 ఓటర్లు ఏమయ్యారు?

Nov 25 2026 12:55 AM | Updated on Nov 25 2026 12:55 AM

చిత్తూరు జిల్లా యంత్రాంగాన్ని నివేదిక కోరిన ఈసీ క్యూలోని ఓటర్లకు ఇచ్చిన స్లిప్పులు 56,067 రిటర్నింగ్‌ అధికారుల నివేదిక.. స్లిప్పుల లెక్కల్లో తేడా ఏడుగురు టీడీపీ ఎమ్మెల్యేల గెలుపుపై అనుమానాలు ఇది ముమ్మాటికీ అక్రమ గెలుపేనంటున్న వైఎస్సార్‌సీపీ నాటి అక్రమాలపై ఫిర్యాదు.. పోరాటానికి సిద్ధం

సాక్షి, చిత్తూరు: ఒక బ్యాంకు మూసేసే సమయానికి క్యూలో 56 వేల మంది కస్టమర్లు ఉన్నారని, వాళ్లందరికీ లావాదేవీలు నిర్వహించడానికి టోకెన్లు ఇచ్చామని అధికారులు వెల్లడించారు. కానీ బ్యాంకు రికార్డుల్లో మాత్రం 24 వేల మంది మాత్రమే లావా దేవీలు నిర్వహించినట్లు నమోదయ్యింది. అంటే మిగిలిన 31 వేల మంది ఏమయ్యారు..? వారి వివరాలు ఎక్కడ..? టోకెన్లు తీసుకున్నవాళ్లు లావాదేవీలు చేయకుండా వెళ్లిపోరు కదా..? ఈ ప్రశ్నలు బ్యాంకు మేనేజరును అడిగితే చెప్పడానికి ఏమీ లేదంటున్నాడు. ఇది గుమస్తా చేసిన పొరపాటు కాదు. 31 వేల మందిని లెక్కించడానికి ఇష్టపడని వ్యవస్థ చేసిన అతి పెద్ద నేరం.

అవును.. వాళ్లు ఏమయ్యారు..!

‘ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌’ సంస్థలోని జర్నలిస్టులు లేవనెత్తిన ప్రశ్నలకు రాష్ట్ర ఎన్నికల సంఘం లోలోపల విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఈ కథనాన్ని ‘సాక్షి’ దినపత్రికతో పాటు జాతీయ దినపత్రికలు ప్రచురించడం, సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ప్రశ్నించడం, రాజకీయ పార్టీలు సైతం ఈ గణాంకాలు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో ఈసీ ఊపిరి పీల్చుకోలేకపోతోంది. ముందుగా వవి ఎన్నికల రికార్డులను తనిఖీ చేయడానికి చిత్తూరు జిల్లా కలెక్టర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కలెక్టరేట్‌లోని కొందరు అధికారులు నాటి రిటర్నింగ్‌ అధికారులు, ఏఆర్‌వోలు ఇచ్చిన నివేదికలు పరిశీలించారు. సాయంత్రం 6 గంటల తరువాత క్యూలైన్లలో ఉన్న ఓటర్లకు ఇచ్చిన స్లిప్పులు ‘ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌’ సంస్థ పేర్కొన్నట్లుగా 56,067 ఉండడాన్ని చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. ఇదే సమయంలో ఆర్‌వోలు, ఏఆర్‌వోలు ఇచ్చిన పోలింగ్‌ శాతం నివేదిక, ఓటర్లకు పంపిణీ చేసిన స్లిప్పుల్లో భారీ వ్యత్యాసం ఉండటాన్ని కూడా అధికారులు నిర్దారించుకున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా 31 వేలకు పైగా స్లిప్పులు అదనంగా పంపిణీ చేశారా..? వాస్తవంగా ఓటర్లు ఓటు వేయకుండా వెళ్లిపోయారా..? అనేదానిపై.. నాడు ఏం జరిగిందో తెలుసుకోవడానికి అధికారులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. దీనిపై రాత పూర్వక ఫిర్యాదు అందినా, ఈసీ నుంచి రాత పూర్వక నివేదిక అడిగితే తమ వద్ద ఉన్న రికార్డులను అందచేయడానికి యంత్రాంగం సంకోచించడంలేదు.

ఏం చెబుదాం?

2024 నాటి ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో వెగులుచూసిన అక్రమాలకు ఇదే నిదర్శనం. ఇక్కడ బ్యాంకుగా వ్యవహరిస్తున్నది ఎన్నికల సంఘం. కస్టమర్లు ఓటర్లు. ఓట్లు వేయడానికి స్లిప్పులు తీసుకున్న ఓటర్లలో 24,596 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఉంది. మిగిలిన 31,471 మంది ఏమయ్యారని ఈసీను ప్రశ్నిస్తుంటే నోరు విప్పడంలేదు. పైగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబునాయుడు సైతం చిత్తూరు జిల్లాలోని కుప్పం నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ‘ది రిపోర్టర్స్‌ కలెక్టివ్‌’ అనే ప్రముఖ సంస్థలోని పరిశోధన జర్నలిస్టులు లేవనెత్తిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఎన్నికల సంఘం నీళ్లు నములుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement