అనంతపురం: అనంత క్రీడాగ్రామం వేదికగా సాగుతున్న ఏసీఏ సౌత్‌జోన్ అండర్–23 మల్టీడే క్రికెట్ టోర్నీలో భాగంగా అనంతపురం, చిత్తూరు జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. చిత్తూరు జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల నష్టానికి 342 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆదివారం ఆట కొనసాగించింది. 130.4 ఓవర్లలో 531 పరుగులకు ఆలౌట్ అయింది. చిత్తూరు బ్యాటర్ కృష్ణతేజారెడ్డి సెంచరీ (132)తో కదంతొక్కాడు. చరంజిత్ (84), రుషిల్ (82), భవానీ ప్రసాద్ (73), సాయిచరణ్ (45) రాణించారు. అనంతపురం బౌలర్లలో ప్రదీప్‌రెడ్డి, అర్జున్ టెండూల్కర్ చెరో మూడు వికెట్లు, ప్రమోద్‌కుమార్ రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు చివరి రోజు ఆట ముగిసే సమయానికి 36.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 254 పరుగులు సాధించింది. అర్జున్ టెండూల్కర్ 65 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. మరో బ్యాటర్ వీరారెడ్డి 64, జయంత్ కృష్ణ 54 పరుగులు సాధించారు.


