మామిడి తోటల్లో గొడ్డలి చప్పుడు
తోటలను నరికేస్తున్న వైనం
ర్యాంపులు, పల్ప్ ఫ్యాక్టరీల సిండికేట్ ఫలితం
చోద్యం చూస్తున్న ప్రభుత్వం
ఏళ్ల తరబడి కన్నబిడ్డల్లా పెంచుకున్న మామిడి తోటలపై రైతులు కన్నీళ్లతో గొడ్డలి ఎత్తుతున్నారు. దిగుబడి బాగున్నా మార్కెట్‌లో కనీస మద్దతు ధర దక్కకపోవడం, వ్యాపారుల సిండికేట్ దోపిడీ, పల్ప్ ఫ్యాక్టరీల మొండి వైఖరితో పెట్టిన పెట్టుబడి కూడా అందడం లేదు. కోత ఖర్చులు, రవాణా చార్జీలు కూడా రాని దుస్థితి. ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలం కావడంతో భారమైన తోటలను వదిలించుకునేందుకు రైతులు 30 నుంచి 35 ఏళ్ల వయస్సున్న చెట్లను నరికేసి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయకపోతే మామిడి పంట ఉనికి ప్రశార్థకంగా మారే ప్రమాదం ఉంది.
పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధాన పంటల్లో మామిడి ప్రధానమైంది. 2.65 లక్షల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. పుత్తూరు వ్యవసాయ డివిజన్ పరిధిలోని పుత్తూ రు, వడమాలపేట, రామచంద్రాపురం, నారాయణవనం మండలాలు 15 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. వడమాలపేట మండలంలోనే ఐదు వేల ఎకరాలు ఉండగా, ఇందులో తోతాపురి రకం అగ్రభాగాన ఉంది. ప్రతి ఏటా దిగుబడి అధికంగా వస్తున్నా గిట్టుబాటు ధరలు అందడం లేదు. కోత కూలీలు సైతం రాకపోవడంతో మనస్తాపానికి గురైన పలువురు రైతులు మామిడి తోటలను తొలగించాలన్న కఠిన నిర్ణయానికి వచ్చారు. అనుకొన్నదే తడవుగా గొడ్డళ్లతో చెట్లను ఎక్కడికక్కడ నరికివేశారు. 30 నుంచి 35 ఏళ్ల వయస్సున్న మామిడి చెట్లను సైతం నరికివేయడం మామిడి రైతన్నల బాధ వర్ణణాతీతం. మామిడి తోటలను పూర్తిగా తొలగించిన వారిలో పుత్తూరు, వడమాలపేట మండలాల్లోని పలువురు రైతులు ఉన్నారు.
మామిడి తోటలు తొలగించిన రైతుల వివరాలు
వడమాలపేట మండలం ఎగవ గూళూరు గ్రామానికి చెందిన ఎస్.కుప్పయ్య 2 ఎకరాలు, టి.సదాశివయ్య 1.5 ఎకరాలు, పి.చలపతిరావు 1.5 ఎకరాలు, పుత్తూరు మండలం తడుకు గ్రామానికి చెందిన రైతులు ఎస్.కుప్పయ్య 2 ఎకరాలు, కె.భూపతి ఎకరా, జి.సుబ్రమణ్యం 1.5 ఎకరాలు, జి.సోమశేఖర్ ఎకరా, పైడిపల్లికి చెందిన ఎస్.రాంబత్తయ్య 1 ఎకరా తోటల్లోని చెట్లను నరికేశారు.
మామిడి ఒక మధుర జ్ఞాపకం కానుందా?
చంద్రబాబు ప్రభుత్వం తీరుతో మామిడి ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోనున్నదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామిడినే నమ్ముకుంటే లాభం లేదని భావించిన రైతన్నలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తుండడమే ఇందుకు నిదర్శనం. తోతాపురి రకం స్థానంలో కొబ్బరి తోటలు, కూరగాయల సాగు చేస్తున్నారు. మరికొందరు నెలవారీ స్థిరమైన ఆదాయం కోసం కోళ్ల షెడ్లు ఏర్పాటుచేసుకోవడానికి ముందుకొస్తున్నారు. హైవేల పక్కనున్న తోటలను చదును చేసిన రైతులు రియల్ ఎస్టేట్ కింద తెగనమ్మేస్తున్నారు. ప్రస్తుతం ముగుస్తున్న నీలం, తోతా పురి కోతలు పూర్తయితే మరి కొందరు రైతులు తోటలను నరికివేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
చోద్యం చూస్తున్న ప్రభుత్వం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లాలో ఇంత దారుణం జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం వేడుక చూస్తోంది. మామిడి తోటలకు తోటలు నరికివేస్తున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని పల్ప్ ఫ్యాక్టరీల సిండికేట్‌ను రూపుమాపి, మామిడి రైతుకు మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే భవిషత్ తరాల వారు చిత్తూరు జిల్లాలో మామిడి తోటలు అధికంగా ఉండేవని పాఠ్యపుస్తకాల్లో చదువుకోవాల్సిన దుస్థితి దాపురిస్తుందేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


