పాలకవర్గంపై పగ | - | Sakshi
Sakshi News home page

పాలకవర్గంపై పగ

Aug 31 2026 12:50 AM | Updated on Aug 31 2026 12:50 AM

సెప్టెంబర్‌ 24న ముగియనున్న గడువు మంజూరైన పనులు రద్దుకు ఉత్తర్వులు జెడ్పీ పరిధిలో రూ.15 కోట్ల విలువైన పనులు సీఈఓలకు ఆదేశాలిచ్చిన పీఆర్‌శాఖ

చిత్తూరు కార్పొరేషన్‌: కూటమి ప్రభుత్వం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలపై కక్ష కట్టింది. వారి పదవీ కాలంలో అభివృద్ధి పనులు చేస్తే మంచిపేరు వస్తుందనే ఉద్దేశంతో మంజూరైన పనులను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికే పంచాయతీలు, జెడ్పీలకు 15, 16వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.100 కోట్ల వరకు విడుదల కావాల్సి ఉంది. దీంతో పంచాయతీల్లో మౌలిక వసతులు కల్పించడానికి నిధుల లేమితో పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీఓలు తలలు పట్టుకుంటున్నారు. ఈ సమయంలో ఉమ్మడి జిల్లా జెడ్పీ పరిధిలో మంజూరైన దాదాపు రూ.15 కోట్ల పనులను ఆపివేయాలంటూ సీఈఓకు పంచాయతీరాజ్‌(పీఆర్‌)శాఖ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది.

పేరు వస్తుందనే రద్దు

ఆర్థిక సంఘం నిధులు రావడంలేదు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు గౌరవంతో పాటు, జీతం కూడా ఇవ్వడం లేదు. పోని వారి కాలంలో మంజూరైన పనులను పూర్తి చేస్తే పేరు వస్తోందని భావిస్తే వాటిని రద్దు చేస్తే ఎలా.. వెంటనే ఆ పనులకు అనుమతులు ఇచ్చి సెప్టెంబర్‌లో పాలకవర్గం పేర్లతో శిలాఫలకం ఏర్పాటు చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించాలని ఇటీవల జరిగిన జెడ్పీ సర్వసభ్య పాలవకర్గ చివరి సమావేశంలో చైర్మన్‌ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉమ్మడి జిల్లాలో రూ.15 కోట్ల పనులు

చిత్తూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు కాంపౌండ్‌వాల్‌ నిర్మాణానికి రూ.23.50 లక్షలు, నిండ్ర మండలంలోని ఇరుగువాయి గ్రామంలో స్లాబు కల్వర్ట్‌ సప్లయ్‌ చానల్‌ కోసం రూ.13 లక్షలు, కవనూరు హరిజనవాడలో ఎంపీపీ పాఠశాల నిర్మాణానికి రూ.25 లక్షలు, పూతలపట్టు పి.కొత్తకోట పంచాయతీలో పాకాల– కొత్తకోట రోడ్డు నిర్మాణానికి రూ.25 లక్షలు, ఎస్‌ఆర్‌పురంలోని 49–కొత్తపల్లెమిట్ట బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.25 లక్షలు, వి.కోట ముదరందొడ్డి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.12 లక్షల చొప్పున రూ.1.23 కోట్లతో మంజూరైన పనులను రద్దు చేయాలని ఆదేశించారు. అలాగే చిత్తూరులో వీఆర్వో భవన్‌కు రూ.14 లక్షలు, జీడీనెల్లూరులో ఎంపీడీఓ కార్యాలయ మరమ్మతులకు రూ.15 లక్షలు, వేల్కూరు పంచాయతీలోని ఎంపీపీ పాఠశాల కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణానికి రూ.8 లక్షలు, కార్వేటినగరంలోని ఆర్‌కేవీబీపేటలో జెడ్పీహైస్కూల్‌ ప్రహరీ గోడ నిర్మాణాకి రూ.19.20 లక్షలు, కుప్పంలోని దొమ్మర అగ్రహారం గ్రామంలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి రూ.11 లక్షలు, చెకుంటం గ్రామంలో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ.25 లక్షలు, నగరిలోని గుండ్రాజుకుప్పంలో ఎంపీపీ పాఠశాల మరమ్మతులకు రూ.7.50 లక్షలు, నంబాకంలో ఎంపీపీ పాఠశాల మరమ్మతులకు రూ.9 లక్షలు అలాగే వేలవాడి ఎస్టీ కాలనీ, ఎం.కొత్తూరు, డి.అగరం, తేరణి, వీఎన్‌ఆర్‌పేట, ఎస్‌ఆర్‌పురం మండలంలో గ్రామాల్లో ఎంపీపీ, జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలల మరమ్మతులు, అభివృద్ధి పనుల కోసం రూ.69.61 లక్షలు మంజూరు చేశారు. ఈ లెక్కన జిల్లాలోని పీఆర్‌ పరిధిని రూ.3 కోట్ల విలువైన పనులను రద్దు చేశారు. ఇలా ఉమ్మడి జిల్లాలో సీసీరోడ్లు, పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, ప్రభుత్వ కార్యాలయాల మరమ్మతులు, గ్రామాలకు కాలువలు ఇతర పనుల కోసం ఉమ్మడి జిల్లాలో సుమారు రూ.15 కోట్లతో మంజూరైన పనులను రద్దు చేశారు.

మంజూరైన పనులు రద్దు

ఉమ్మడి చిత్తూరు జెడ్పీ పదవీకాలం సెప్టెంబర్‌ 24న ముగియనుంది. ఈ క్రమంలో జెడ్పీ, పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ పరిధిలో ఉమ్మడి జిల్లాలో రూ.15 కోట్ల పనులు మంజూరు చేశారు. తాజాగా వాటిని రద్దు చేయాలని పంచాయతీరాజ్‌శాఖ సీఈఓకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. సెప్టెంబర్‌ 24న జెడ్పీ పాలకవర్గ గడువు ముగయనున్న నేపథ్యంలో ఆ లోపు పనులు పూర్తి చేస్తే వారికి మంచి పేరు వస్తుందని భావించి ప్రభుత్వం రద్దుకు కంకణం కట్టుకుందని, కొత్త పాలకవర్గం వచ్చాక వారికి ఆ పనులను మంజూరు చేయాలని కుట్ర పన్నుతోందని జెడ్పీ చైర్మన్‌, 65 మంది జెడ్పీటీసీలు, 877 మంది ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement