● వదట్టూరు కండ్రిగకు చెందిన వ్యక్తి అరెస్టు ● నగల కోసమే హత్య చేసినట్టు ఒప్పుకున్న నిందితుడు
తిరువళ్లూరు: బంధువుల ఇంటికి వచ్చిన ఆంధ్ర మహిళ ముఖంపై యాసిడ్ చల్లి గొంతునులిమి హత్య చేసి మృతదేహాన్ని ముళ్ల పొదల్లో పడేసిన ఘటనలో చిక్కుముడి వీడింది. మహిళను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. వారం క్రితం తిరువళ్లూరు జిల్లా వెల్లాకులం సమీపంలోని ముళ్ల పొదల్లో సుమారు 40 వయస్సు వున్న మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఊత్తుకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో హత్యకు గురైన మహిళ చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నిండ్ర మండలం చవరంబాక్కం గ్రామానికి చెందిన అరుణగా గుర్తించారు. ఆమె భర్త మృతి చెందిన క్రమంలో ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం వుంటోంది. ఘటన జరిగిన రోజు బంధువుల పెళ్లి కోసం తిరువళ్లూరు జిల్లా వదట్టూరు కండ్రిగకు వచ్చి దారుణ హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే మృతదేహానికి సమీపంలో లభించిన సెల్‌ఫోన్‌తో పాటు వెల్లాకుళం, వదట్టూరు కండ్రిగ, తామరపాక్కం తదితర ప్రాంతాల్లో వున్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా విచారణను ముమ్మరం చేశారు. దీంతో పాటు నిందితుడ్ని పట్టుకోవడానికి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు. మొదట మహిళ సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్స్ ఆధారంగా వదట్టూరు కండ్రిగ గ్రామానికి చెందిన భారతీరాజా(42)ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో హత్యకు గురైన అరుణకు, భారతీరాజాకు మధ్య గత కొన్నేళ్ల్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రోజు రాత్రి ఈ ఇద్దరూ కలిసిన సమయంలో, గతంలో భారతీరాజాకు అరుణ ఇచ్చిన బంగారు నగలను తిరిగి ఇవ్వాలని కోరడంతో వివాదం మొదలై హత్యకు దారితీసినట్లు పోలీసులు నిర్ధారించారు. దీంతో భారతీరాజాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


