యాదమరి: మద్యానికి బానిసై ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా, యాదమరి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు కథనం.. మండల పరిధి కుక్కలపల్లి గ్రామానికి చెందిన గోపి ఆచారి కుమారుడు సోమశేఖర్(33) చిన్నపాటి పనులు చేసుకుని స్థానికంగా జీవనం సాగిస్తుండే వాడు. ఇతనికి ఎవ్వరూ లేరు. మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకుని తనువు చాలించాడు. అదే సమయంలో అతని స్నేహితులైన భూపతి, నిర్మల్, సోమశేఖర్‌ను కలవడానికి రాగా.. అతను ఉరికి వేలాడడాన్ని గమనించి గట్టిగా కేకలు వేశారు. ఆ తర్వాత స్థానికులు వెంటనే సోమశేఖర్‌ను కిందకి దించి చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా మృతునికి ఎవరూ లేనందున మద్యానికి బానిసై జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. యాదమరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి
శ్రీరంగరాజపురం : వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని పెద్దతయ్యూరు దళితవాడలో చోటు చేసుకుంది.స్థానికుల కథనం మేరకు టి.గోవిందయ్య (57) బుధవారం మధ్యాహ్నం తన పంట పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఈక్రమంలో వడదెబ్బ తగిలి కింద పడిపోవడంతో అక్కడే ఉన్న పశువుల కాపరులు , రైతులు వచ్చి చూసేలోపల గోవిందయ్య మృతి చెందినట్లు తెలిపారు.
కారు ఢీకొని ఇద్దరికి గాయాలు
తవణంపల్లె: మండలంలోని గల్లావాళ్ళవూరు వద్ద అతివేగంగా అరగొండ వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు వివరాలిలా. మండలంలోని గల్లావాళ్ళవూరు వద్ద చిత్తూరు పట్టణం వెంగళరావు కాలనీకి చెందిన మురళి, చరణ్ ద్విచక్ర వాహనంపై చిత్తూరుకు వస్తుండగా అరగొండ వైపు వెళ్తున్న కారు అతివేగంగా నడుపుతూ బైక్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో మురళి, చరణ్‌కు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ పరారైనట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
శ్రీవారి దర్శనానికి 14 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ అధికంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 24 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. మంగళవారం అర్ధరాత్రి వరకు 80,389 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 32,213 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 14 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


