ఆర్‌జేడీ ఆకస్మిక తనిఖీలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా గురువారం నిర్వహించిన ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ తీరును ఇంటర్మీడియెట్ ఆర్‌జేడీ సురేష్‌బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు. బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో ప్రశ్నపత్రాల ఉపసంహరణ, పలమనేరు జోన్‌న్‌లోని పలు పరీక్ష కేంద్రాలు, పీసీఆర్ ప్రభుత్వ కళాశాల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో నిబంధనల అమలు, మౌలిక సదుపాయాలను పర్యవేక్షించిన ఆర్జేడీ మాట్లాడుతూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం జరిగిన పరీక్షకు జనరల్ విభాగంలో 12,305 మందికి గాను 11,950 మంది హాజరుకాగా 355 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌లో 1,648 మందికి గాను 1,589 మంది హాజరుకాగా, 59 మంది గైర్హాజరైనట్లు ఇంటర్మీడియెట్ డీఐఈవో రఘుపతి తెలిపారు. ఈ తనిఖీల్లో డీఐసీ మెంబర్లు దయానందరాజు, సయ్యద్ మౌలా పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
గంగవరం: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని స్టేట్ అబ్జర్వర్, ఆర్‌జేడీ సురేష్‌బాబు తెలిపారు. గురువారం జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న పరీక్షల నిర్వహణను జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాశాఖాధికారి రఘుపతితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని పీసీఆర్ కళాశాల, డీఈవో ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌తో పాటు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో ప్రశ్న పత్రాల ఉపసంహరణను తనిఖీ చేశారు. ఆ తరువాత పలమనేరు జోన్‌లోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు.


