హిందువుల మనోభావాలతో చెలగాటమా?
పుత్తూరు: ముఖ్యమంత్రి పదవిలోని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలవంపులని మాజీ డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణస్వామి మండిపడ్డారు. గురువారం పుత్తూరులోని ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో చంద్రబా బు మాట్లాడుతూ ఎన్‌డీడీబీ రిపోర్టు సస్పెక్టడ్ అలట్రేషనన్ అని చెప్పిందంటూనే వెంటనే అనిమల్ ఫ్యాట్ ఉందంటూ చెప్పడం అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా అని ప్రశ్నించా రు. గతంలో జంతువుల కొవ్వు కలిసిందని మాట్లాడిన చంద్రబాబు అసెంబ్లీలో కల్తీ జరిగిందంటూ మాట మార్చారన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు సరఫరా అయిన నెయ్యి కంపెనీలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 2014–2019 మధ్య జేసీబీలతో వేలాది ఆలయాలను ధ్వంసం చేయించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఆయన దైవం అంటూ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉందన్నారు. జగనన్న పాలనలో 2,400 ఆలయాలను పునఃనిర్మించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మత రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.


