ఆశాలతో వెట్టిచాకిరీ
పనిభారంతో అవస్థలు జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ధర్నా
రోజంతా డ్యూటీ
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ప్రభుత్వం ఆశాలతో వెట్టిచాకిరీ చేయిస్తోంది. వేధింపులకు గురిచేస్తోంది. సర్వేలు, వైద్య పరీక్షలు, అదనపు పనులు, మీటింగ్ వ్యయాలను పెంచేసింది. వీటినిభరించలేక చిరుద్యోగులు రోడెక్కారు. గురువారం చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఆశా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. పనిభారం, అధికారుల ఒత్తిళ్లు, అవమానకర ప్రవర్తనతో ఆశాలు మానసికంగా కుంగిపోతున్నారు. ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పరిస్థితి మారకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 50 పీహెచ్‌సీలు, 15 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో 1,007 మంది ఆశావర్కర్లు పనిచేస్తున్నారు. వీరంతా కింద స్థాయిలో అదనపు పనులతో నానా తిప్పలు పడుతున్నారు.
ఏఎన్‌ఎంల పనులు కూడా ఆశాలకే
104 వాహనాల్లో బీపీ, షుగర్ పరీక్షలు చేయించడం, ఏఎన్‌ఎంల పనులను కూడా ఆశాల చేత చేయించడం, డబ్బాలు మోయించడం జరుగుతోందని ఆరోపించారు. పనులు చేయలేమంటే డ్యూటీ చేసి నా వేతనాల్లో కోతలు విధిస్తున్నారని వాపోతున్నా రు. ఎన్సీడీసీ, పీవర్ సర్వేలకు రోజువారీ టార్గెట్లు పెట్టి తీవ్ర ఒత్తిడి పెడుతున్నారని ఆశాలు పేర్కొంటున్నారు. రోజుకు 20 కుటుంబాలు సర్వే చేయాలని, యాప్ పనులు పూర్తి చేయాలని ఒత్తిడి తెస్తూ, పూర్తికాకపోతే జీతాల్లో కోతలు పెడుతున్నారని వాపోతున్నారు. ప్రభుత్వం సరఫరా చేయని రికార్డు లను చూపించాలని అడుగుతున్నారని, కొనాలంటే రూ.300 వరకు ఖర్చవుతోందని చెప్పారు. రోజూ ఫొటోలు అప్లోడ్ చేయాలని చెప్పి, లాగిన్ సమస్య లు ఉన్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అవమానాలు, వేధింపులు
వ్యక్తిగత అత్యవసర పరిస్థితుల్లో సెలవు కోరినా ఇబ్బంది పెడుతున్నారని, ప్రజల ముందే దూషించడం జరుగుతోందని ఆశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోందని చెబుతున్నారు. సమస్యల పరిష్కారానికి వెంటనే జాయింట్ సమావేశం ఏర్పాటు చేసి, జిల్లా అధికారుల ఆదేశాలు అన్ని పీహెచ్‌సీల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆశాలు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా కార్యాలయం ఎదుట ధర్నా
ఆశాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని ఆశావర్కర్లు గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యాలయం ఎదుట బైఠాయించి నినాదాలతో హోరెత్తించారు.
జిల్లాలో ఆశా వర్కర్లపై వేధింపులు


