ఆరోగ్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఆరోగ్య సేవల్లో నిర్లక్ష్యం వద్దని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి హెచ్చరించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో గురువారం ఆమె ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రతి పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలను పూర్తిగా పేపర్‌రహిత కార్యాలయాలుగా నిర్వహించాలని, రికార్డు నిర్వహణ అంతా 100 శాతం ఆన్‌లైన్‌లో ఉండాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి నాటికి పూర్తిగా వినియోగించాలన్నారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్‌లో ప్రతి ఓపీ రిజిస్ట్రేషన్, ల్యాబ్ పరీక్షలు, ఫార్మసీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని తెలిపారు. గర్భిణులందరికీ ఏబీహెచ్‌ఏ ఐడీ నమోదు చేసి అవసరమైన సేవలను అందించాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో సికిల్ సెల్ అనీమియా టార్గెట్లను పూర్తి చేయాలని, పాఠశాలల్లో ప్రతి గురువారం విద్యార్థులకు వీక్లీ ఐరన్ ఫోలిక్ మాత్రలు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. షెడ్యూల్డ్ ట్రైబ్ పాఠశాలల్లో మరణించిన పిల్లల వివరాలను వెంటనే పంపాలని ఆదేశించారు.
ఐహెచ్‌ఐపీ పోర్టల్‌లో ఎస్పీఎల్ పారామీటర్లను ఏబీహెచ్‌ఏ ఐడీతో ప్రతిరోజూ అప్‌డేట్ చేయా లని తెలిపారు. ఎన్‌సీడీ 4.0లో డాక్టర్ స్క్రీనింగ్, పాలోఅప్ తప్పనిసరిగా ఉండాలన్నారు. త్వరలో 14 ఏళ్లలోపు బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఇవ్వనున్నందున అవసరమైన డేటాను సేకరించాలని తెలి పారు. సమావేశంలో డాక్టర్ వెంకటప్రసాద్, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ ప్రవీణ, డాక్టర్ అనూష, శ్రీవాణి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.


