ఆరోగ్య సూచికల్లో వెనుకబాటు వద్దు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ప్రతి రోజూ పురోగతిని రాష్ట్ర కమిషనర్‌కు నివేదించాలని, దీనిని దృష్టిలో ఉంచుకుని సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధారాణి అన్నారు. బుధవారం చిత్తూరులోని తన కార్యాలయంలో ఆమె అధికారులతో సమీక్షించారు. పీహెచ్‌సీల్లో అందుతున్న సేవలపై ప్రజల స్పందన వంద శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్‌లో ఓపీకి వచ్చే ప్రతి రోగి నమోదు, అభా ఐడీ లింకేజ్‌పై రోజువారీ వివరాలు పంపాలని, మాతా–శిశు ఆరోగ్య కార్యక్రమంలో మాతృ మరణాలు–శిశు మరణాలు అదే రోజు యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లాలో టీనేజ్ గర్భధారణలు ప్రస్తుతం 11 శాతం ఉన్నాయని, అవగాహన కార్యక్రమాలతో దీనిని సున్నాకు తీసుకురావాలన్నారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్‌న్స్ ప్రాజెక్ట్ కింద పీ, ఎల్, ఎస్ ఫారమ్ వివరాలను అభా ఐడీ లింకేజితో ప్రతిరోజూ పంపాలని చెప్పారు. ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో బ్రెస్ట్, ఓరల్, సర్వైకల్ క్యాన్సర్ అనుమానిత కేసుల్లో వారానికి కనీసం 75 మందిని వైద్యుల పరిశీలనకు పంపించి అవసరమైన వారికి చికిత్స అందించాలన్నారు. జిల్లాలో గర్భిణులకు అభా ఐడీ లింకేజి ప్రస్తుతం 79 శాతం మాత్రమే ఉందని, దీన్ని 100 శాతానికి తీసుకురావాలన్నారు. పీహెచ్‌సీలకు విడుదలైన బడ్జెట్‌ను అవసరాలకు అనుగుణంగా వినియోగించి బిల్లులు సమర్పించాలన్నారు. సూచికల్లో లోపాలు ఉంటే కమిషనర్ స్థాయిలో చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు, వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సూపర్‌వైజర్ సిబ్బంది పాల్గొన్నారు.
3న గ్రహణకాలాభిషేకం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో చంద్రగహణాన్ని పురస్కరించుకుని మార్చి 3వ తేదీన గ్రహణకాలాభిషేకాలు నిర్వహించనున్నట్టు ఆలయాధికారులు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా గ్రహణ మధ్య కాల సమయంలో స్వామి, అమ్మవార్లకు గ్రహణ కాల శాంతి అభిషేకాలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఇదిలావుండగా శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయాన్ని మార్చి 4న లెక్కించనున్నట్లు అధికారులు తెలిపారు.


