దోపిడీలో అనకొండలు!
భారీ యంత్రాలతో గుట్టలు, కొండలు ధ్వసం గంగాధరనెల్లూరు నుంచి తమిళనాడుకు అక్రమ రవాణా రాత్రికి రాత్రే తరలుతున్న గ్రావెల్, ఇసుక, కంకర అక్రమార్కులతో అధికారుల కుమ్మక్కు అభివృద్ధి పేరుతో భారీగా దోపిడీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో దందా అక్రమాలపై కన్నెత్తి చూడని అధికార గణం
కార్వేటినగరం: అధికారాన్ని అడ్డుపెట్టుకుని అభివృద్ధి పేరుతో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. గుట్టలు, కొండలను కరగదీసి జేబులు నింపుకుంటున్నారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గం తమిళనాడుకు సరిహద్దు ప్రాంతం కావడంతో అక్రమ రవాణాకు రాచబాటగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి గ్రావెల్, ఇసుక, కంకరను రాత్రికి రాత్రే తరలించేస్తున్నారు. వందల ఎకరాల్లో కొండలను సైతం కొల్లగొట్టి రూ.కోట్లు దోచుకుంటున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
300 ఎకరాల్లో తోడేస్తున్నారు!
కార్వేటినగరం మండలం, గోపిశెట్టిపల్లె సమీపంలోని ఎల్‌ఆర్ పేట వద్ద పుదిపట్టు గ్రామానికి ఆనుకుని సర్వే నం.51లో 500 ఎకరాల విస్తీర్ణంలో కొండ ప్రాంతం ఉంది. ఈ కొండ నుంచి గ్రావెల్ భాగుండడంతో తమిళనాడులో మంచి గిరాకీ ఏర్పడింది. అక్కడి కాంట్రాక్టర్లతో కుమ్మకై ్కన టీడీపీ నాయకులు ఈ కొండపై కన్నేశారు. తచ్చూరు హైవే పనుల నిమిత్తం గ్రావెల్ తరలించేందుకు అనుమతి తీసుకుని భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు. నిత్యం ఇక్కడి నుంచి వందల టిప్పర్లలో గ్రావెల్ తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే అక్రమ గ్రావెల్ తవ్వకాలు, రవాణా జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కొండలను పిండి చేసి కోట్లను కొల్లగొడుతున్నారు.
గ్రామస్తులు అడ్డుకోవడంతో నిలిచిపోయిన టిప్పర్లు
తమిళనాడులోని నొచ్చిలి వద్ద ఇంట్లోకి దూసుకెళ్లిన టిప్పర్(ఫైల్)
అభివృద్ధి పేరుతో దోపిడీ
అభివృద్ధిని అడ్డుగా పెట్టుకుని కూటమి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు. తచ్చూరు పనులు పూర్తయినప్పటికీ దాని ముసుగులో వందల టన్నుల గ్రావెల్ తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి తచ్చూరు హైవే రోడ్డును దాటుకుని నేరుగా చైన్నైకి తరలించేస్తున్నారు. కొండ ఉన్న ప్రాంతాన్ని జేసీబీలు, హిటాచీతో ధ్వసం చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే 200 ఎకరాల్లో మట్టిని తవ్వి దోపిడీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఎన్‌ఆర్ పేట నుంచి పళ్లిపట్టు, నొచ్చిలి, తిరుత్తణి, అరక్కోణం మీదుగా చైన్నైకి తరలిస్తున్నారు. టిప్పర్ గ్రావెల్ రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు ధర పలుకుతోంది. రోజుకి రూ.15 లక్షల చొప్పున నెలకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఆదాయాన్ని గడిస్తున్నారు. పరిమితికి మించి తవ్వకాలు, రవాణా చేస్తున్నా ఏ ఒక్కరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. గత ఆదివారం రాత్రి ఎల్‌ఆర్‌పేట కొండ నుంచి గ్రావెల్ తీసుకుని వెళుతుండగా తమిళనాడులోని నొచ్చిలి గ్రామం గంగరాజుకండ్రిగ వద్ద టిప్పర్ ఇళ్లపైకి దూసుకెళ్లింది. ఆగ్రహానికి గురైన గ్రామస్తులు టిప్పర్‌తో పాటు మరో 10కిపైగా టిప్పర్లను వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనతో అసలు విషయం బయట పడింది. దీనిపై జిల్లా స్థాయి అధికారులు సైతం నోరుమెదపక పోవడం గమనార్హం.
దోపిడీలో అనకొండలు!


