విమానం ఎగరకపాయె..రైలు మార్గం రాకపాయె! | - | Sakshi
Sakshi News home page

విమానం ఎగరకపాయె..రైలు మార్గం రాకపాయె!

Jan 28 2026 7:13 AM | Updated on Jan 28 2026 7:13 AM

విమానం ఎగరకపాయె..రైలు మార్గం రాకపాయె!

విమానం ఎగరకపాయె..రైలు మార్గం రాకపాయె!

● బంగారుపేట నుంచి చిత్తూరుకు రైలు మార్గం ఎప్పుడో? ● తిరుపతి–బెంగళూరు మధ్య 92కి.మీ దూరం తగ్గే అవకాశం ● కాణిపాకం, పలమనేరుకు కొత్త రైలుమార్గం కలిగే వెసులుబాటు

దశాబ్దాలుగా రైలు మార్గం కోసం నిరీక్షణ

పలమనేరు: చిత్తూరు జిల్లాలో పడమటి మండలాల అభివృద్ధి ఎండమావిగానే మారుతోంది. పంటలు సాగుచేసే రైతులున్నప్పటికీ సరైన రవాణా సౌకర్యాలు లేక తగిన ధర దొరక్క ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. ఇలాంటి తరుణంలో ఈ ప్రాంతానికి రైలు మార్గం ఉన్నట్లయితే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. దాంతోపాటు వ్యాపా రం వృద్ధి చెందుతుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో విమానాశ్రయ ఏర్పాటు కోసం చేసే ప్రయత్నాలను రైలు మార్గం పై చేసి ఉంటే ఈ ప్రాంతం ఎప్పుడో అభివృద్ధి చెందేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.

కొత్త రైలు మార్గంతో ఎంతో మేలు

చిత్తూరు నుంచి కర్ణాటకలోని బంగారుపేటకు రైలు మార్గం ఏర్పాటు చేస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వారు బెంగళూరుకు వెళ్లేందుకు ప్రయాణ సమయం ఒకటిన్నర గంట తగ్గు తుంది. నిత్యం ఉమ్మడి జిల్లా నుంచి ఉద్యోగ, వ్యాపార, బంధువుల కోసం వేలాదిమంది బెంగళూరుకు వెళుతుంటారు. అదే విధంగా కర్ణాటక నుంచి నిత్యం భక్తులు తిరుమల, కాణిపాకంకు వస్తుంటారు. వీరి రాకపోకలకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.

హార్టికల్చర్‌ హబ్‌గా మారే అవకాశం

కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో కూర గాయల సాగు ఎక్కువ. ఇక్కడ సాగుచేసే బంగాళాదుంప, టమాట, బీన్స్‌, కాలీఫ్లవర్‌, క్యా బేజీ, పూలు తదితర ఉత్పత్తులకు దేశంలోని కేరళ, తెలంగాణ, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, గోవా తదితర రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉంది. కానీ తగిన రవాణా సౌకర్యం లేక అవస్థలు పడాల్సి వస్తోంది.

92 కి.మీ ప్రయాణదూరం తగ్గుతుంది

ప్రస్తుతం తిరుపతి నుంచి బెంగళూరుకు పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట్‌, కుప్పం, బంరుపేట మీదుగా బెంగళూరుకు రైళ్లు వెళుతున్నాయి. తిరుపతి నుంచి బెంగళూరుకు 325 కి.మీగా దూరం ఉంది. అదే చిత్తూరు నుంచి కాణిపాకం, పలమనేరు, ముకబాగిళ్‌ మీదుగా బంగారుపేటకు లింకుగా రైలు మార్గం నిర్మిస్తే ఈ రెండు నగరాల మధ్య 92 కి.మీ దూరం తగ్గడంతోపాటు ఒకటిన్నర గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.

ఎవరి కోసం

కుప్పం ఎయిర్‌ పోర్టు

కుప్పం నియోజకవర్గంలో ఎయిర్‌ పోర్టును నిర్మించి తీరుతామని సీఎం చంద్రబాబు ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు. అసలు ఈ ప్రాంత వాసులు విమానాల్లో తిరిగే పనులేముంటాయి. అసలే పేదలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో విమానాలను చూడడానికి తప్ప అందులో ప్రయాణించే వారెవరు అని ఇక్కడి వారే ప్రశ్నిస్తున్నారు. కుప్పానికి సమీపంలోనే బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇటు చైన్నెలో ఉంది. తాజాగా తమిళనాడులోని బొరుగూరులో విమానాశ్రయానికి అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో కుప్పంలో ఎందుకు విమానాశ్రయమనే మాట వినిపిస్తోంది. రైతుల భూములను చౌకగా కొట్టేసేందుకు సాగుతున్న ప్రక్రియేననే విమర్శలున్నాయి.

దశాబ్దాలుగా హామీలకే పరిమితం

చిత్తూరు నుంచి కర్ణాటకలోని బంగారుపేట వరకు రైలు మార్గం ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వంలో రైల్వే సహాయ మంత్రిగా పనిచేసిన మునియప్పన్‌ పలుమార్లు వెల్లడించారు. అప్పటి పలమనేరు మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి సైతం దీని గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ విషయమై ఎటువంటి కదలిక లేకుండా పోయింది. స్థానికులు సైతం దశాబ్దాలుగా ఈ రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలని విన్నవిస్తూనే ఉన్నారు. బైరెడ్డిపల్లెకు చెందిన వెంకటాచలం శెట్టి మూడు దశాబ్దాలుగా ఈ రైల్వే లైను కోసం పోరాటం చేసి కన్నుమూశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement