కక్ష సాధింపుతోనే దుకాణాల తొలగింపు
పెనుమూరు(కార్వేటినగరం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నాలుగు కుటుంబాలకు చెందిన దుకాణాలను ధ్వంసం చేసి తొలగించడం దారుణమని మాజీ ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం రాత్రి టీడీపీ గూండాలు ధ్వంసం చేసిన దుకాణాలను వైఎస్సార్‌సీపీ నాయకులతో కలసి మంగళవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చాక ఎక్కడ చూసినా అక్రమాలు, అఘాయిత్యాలు, దోపిడీలకు అంతులేకుండా పోతోందని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెనుమూరు ఆర్టీసీ బస్టాండులో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి రోడ్లపై చిరు వ్యాపారులకు అప్పగించేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రోడ్డుపై చిరు వ్యాపారులు సాగించే నాలుగు కుటుంబాలపై కక్ష సాధింపుతో రాత్రికి రాత్రే దుకాణాలను తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అధికారం ఎప్పుడూ ఒకేలా ఉండబోదని మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి మహాసముద్రం దయాసాగర్‌రెడ్డి, మండల కన్వీనర్ విజయకుమార్‌రెడ్డి, రాష్ట్ర పంచాయతీ కార్యదర్శి దేవరాజులురెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు దూదిమోహన్, మాజీ మండల పార్టీ కన్వీనర్ సురేష్‌రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ద్రాక్షాయణితోపాటు పలువురు నేతలు ఉన్నారు.


