ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎంఈవోలు, నాన్ టీచింగ్ సిబ్బంది ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫేషియల్ అటెండెన్స్ వేయాల్సిందేనని డీఈవో రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. ఈ మేరకు పలు అంశాలపై ఆయన మంగళవారం క్షేత్ర స్థాయి విద్యాశాఖ అధికారులతో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 13న 286 మంది విద్యాశాఖ ఉద్యోగులు ఫెషియల్ అటెండెన్స్ వేయాల్సి ఉందన్నారు. అయితే 189 మంది మాత్రమే నమోదు చేశారని, మిగిలిన వారు వేయలేదని చెప్పారు. వేయని వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ఇదే విధంగా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో టిస్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. పూర్తి చేయని 121 మంది వెంటనే వివరాలు నమోదు చేయాలన్నారు. నూతనంగా విధుల్లో చేరిన 1,400 మంది టీచర్లు ఆప్షన్ ఇచ్చిన వెంటనే వివరాలు నమోదు చేస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా కిచెన్ గార్డెన్ పనులు చేపట్టని 271 పాఠశాలలు వెంటనే ప్రక్రియ మొదలు పెట్టాలన్నారు. లేని పక్షంలో చర్యలుంటాయని హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ పరిధిలో 400 ఈ బైసైకిల్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 57 మంది ఈ బైసైకిల్స్ కొనుగోలుకు నగదు చెల్లించారన్నారు. సైకిల్ ధర రూ.24 వేలు ఉంటుందని, మొదటగా రూ.5 వేలు చెల్లించి, నెలవారీగా రూ.900 చెల్లించే అవకాశం కల్పించారన్నారు. పదోతరగతి మూల్యాంకన కేంద్రానికి స్థలం గుర్తించి నివేదికలు పంపాలని పరీక్షల విభాగం అధికారులను ఆదేశించారు. జిల్లాలో పీఎంశ్రీ, ఎంఆర్‌సీ గ్రాంట్‌లను వెంటనే ఖర్చు చేయాలన్నారు.


