పండగ పూటా ఎక్కిళ్లే!
అధికార పార్టీ నేతల బెదిరింపులతో మూడు నెలలుగా అవస్థలు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులెక్కువనే కక్ష సాధింపు జెడ్పీ చైర్మన్ నిధులు విడుదల చేసినా ఫలితం శూన్యం
పలమనేరు: మండలంలోని పెంగరగుంట పంచాయతీ, జంగాళపల్లి గ్రామస్తులు మూడు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని బోర్లు మరమ్మతులకు గురికావడంతో వ్యవసాయ బోర్ల నుంచి మంచినీటిని తెచ్చుకుంటున్నారు. ఈ గ్రామంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే అధికంగా ఉండడంతో అక్కడి కూటమి నేతలకు మింగుడు పడడం లేదు. నీటి సమస్యను పరిష్కరించకుండా అధికారుల అండతో వారి గొంతు ఎండేలా చేసి కసి తీర్చుకుంటున్నారు. దీన్ని గమనించిన అక్కడి వైఎస్సార్‌సీపీ నాయకులు జెడ్పీ చైర్మన్‌కు విన్నవించగా.. ఆయన వెంటనే కొత్తబోరు, మోటార్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేశా రు. అయినా కూటమి నేతలకు భయపడి ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పనులు చేపట్టలేదు. దీంతో గ్రామస్తు లు పండగపూటా తాగునీరు లేక అవస్థలెదుర్కొంటున్నారు.
వైఎస్సార్‌సీపీకి ఓటేశారనే..
ఈ గ్రామంలో దాదాపు 70 గడపలు, 300 దాకా జనాభా ఉన్నారు. గ్రామంలోని బోరును గతంలో చెరువులో వేయడంతో అది మరమ్మతులకు గురైంది. మూడు నెలల నుంచి తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులను ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. వీరి బాధను గమనించిన ఆ పంచాయతీ వైఎస్సార్‌సీపీ నాయకులు రాజారెడ్డి సమస్యను జెడ్పీ చైర్మన్ వాసు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి జెడ్పీ 15 ఫైనాన్స్ టైడ్ నిధుల ద్వారా కొత్తగా బోరు వేసేందుకు, దానికి మోటారు కోసం గతనెల 29న రూ.6.3 లక్షలు మంజూరు చేశారు. 15 రోజుల్లో పనులు పూర్తి చేయాలనిన ఎంపీడీవో, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశించారు. ఆయన మాటలు విని సంతోషించిన గ్రామస్తులు ఎంపీడీవో వద్దకు తిరుగుతున్నా ఆయన కూటమి నేతల బెదిరింపులతో పనులు చేపట్టలేదు. దీంతో గ్రామస్తులు మంగళవారం సైతం ఆయన్ను కలిసి సంక్రాంతి పండుగను పురష్కరించుకొని వెంటనే పనులు చేపట్టాలని కోరారు. అయినా ఆయన నీళ్లు నమలడంతో నిరాశగా వెనుదిరిగారు. మూడు నెలలుగా కరెంట్ వచ్చినప్పుడు గ్రామ సమీపంలోని వ్యవసాయ బోర్ల వద్ద నుంచి మంచినీటిని తెచ్చుకోవాల్సి వస్తోంది. దీనిపై పలమనేరు ఎంపీడీవో భాస్కర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన ఫోన్ పిక్ చేయడం లేదు. కాగా పలమనేరులో అధికారుల నిర్లక్ష్యంపై తాను జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని జెడ్పీ చెర్మన్ తెలిపారు.
జంగాళపల్లి వాసులకు తప్పని తాగునీటి కష్టాలు
పండగ పూటా ఎక్కిళ్లే!


