16న విశ్వంలో సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్ మోడల్ టెస్ట్
తిరుపతి సిటీ: స్థానిక వరదరాజనగర్‌లోని విశ్వం సైనిక్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రెన్‌న్స్ ఎగ్జామ్ – 2026కు సంబంధించి ఈనెల 16న ఉచిత మోడల్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్ విశ్వనాథ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ స్థాయిలో సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఈనెల 18వ తేదీన జరగనున్న నేపథ్యంలో, సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు పరీక్షకు ముందస్తు సాధన కల్పించేందుకు మోడల్ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ నమూనా పరీక్ష ద్వారా విద్యార్థులు ప్రధాన పరీక్షకు సన్నద్ధం కావడంతో పాటు, సబ్జెక్టుల వారీగా తమ లోపాలను గుర్తించి, సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. మోడల్ పరీక్షకు ఎటువంటి ప్రవేశ రుసుము అవసరం లేదని స్పష్టం చేస్తూ, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమ సైనిక్ స్కూల్ అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) జిరాక్స్ కాపీని తప్పనిసరిగా వెంట తీసుకురావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 86888 88802 / 93999 76999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
పండక్కి ఊరెళుతూ పరలోకాలకు..
నాగలాపురం: పండక్కి ఊరెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన నాగలాపురం మండలం, కృష్ణాపురంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. మండలంలోని దక్షిణపుకోట వీధికి చెందిన టి.శేఖర్ కుమారుడు టి.హర్షవర్ధన్(13) స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్లస్‌లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల నిమిత్తం తన మేనమామ, అతని కొడుకుతో కలిసి ముగ్గురు ద్విచక్రవాహనంలో తిరుపతికి బయలు దేరారు. కృష్ణాపురం స్పీడ్ బేకర్ వద్ద వెనుక కూర్చుని ఉన్న హర్షవర్థన్ ద్విచక్ర వాహనం నుంచి అదుపు తప్పి కింద పడిపోయాడు, ఆ సమయంలో ఊత్తుకోట్టై వైపు వెళుతున్న టిప్పర్ హర్షవర్థన్ తలపై ఎక్కడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను సురుటుపల్లి సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులో తీసుకున్నారు. మృతుని తండ్రి శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సునీల్ తెలిపారు.


