అర్జీల ఆవేదన!
ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 106 అర్జీలు
చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. వివిధ సమస్యలపై మొత్తం 106 అర్జీలు సమర్పించారు. ప్రజల అర్జీల పరిష్కారంలో క్షేత్ర స్థాయి అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ హెచ్చరించారు. జేసీ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్రపడాల్, డీఆర్‌వో మోహన్‌కుమార్ పాల్గొన్నారు.
విద్యుత్ లైన్ మార్పు చేయకుండా..
విద్యుత్ శాఖ అధికారులు 11 కేవీ విద్యుత్ లైన్ మార్పు చేయకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారని చిత్తూరు నగరంలోని సంతపేటకు చెందిన జగన్, మురళి, నరేష్, కళ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు సోమవారం పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేశారు. తాము గృహాలు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తుండగా 11 కేవీ లైన్ సమస్యగా మారిందన్నారు. విద్యుత్ లైన్‌ల మార్పిడికి మూడు నెలల క్రితం రూ.1.62 లక్షలు ప్రభుత్వం చలానాగా చెల్లించినట్లు చెప్పారు. అయితే విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ లైన్ మార్పు చేయకుండా అలసత్వం వహిస్తున్నారన్నారు.


