సేవలకు గ్రహణం
కార్వేటినగరం : జీడీ నెల్లూరు నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రాలు రేషన్ షాపులుగాను, మరికొన్ని నిర్మాణం పూర్తికాక అసంపూర్తిగా దర్శన మిస్తున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 88 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. మండలాల్లో గతంలో రైతులకు ఎప్పుడు ఎరువులు, విత్తనాలు, అవసరమైనవి అందుబాటులో ఉండేవి. అప్పట్లో వాటి గడువు ముగిసి పోతే ప్రభుత్వమే వెనక్కి పంపి మళ్లీ కొత్త స్టాకు తెప్పించి ఉంచేది. నేడు ఆ పరిస్థితి లేదు. ఎరువులు అందుబాటులో ఉండడం లేదు. విత్తనాలు కనుమరుగు అయ్యాయి. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పాలసముద్రం మండల కేంద్రంలోని ఆర్బీకేలో ఏకంగా రేషన్ దుకాణం ఏర్పాటు చేశారు. కార్వేటినగరం మండలంలో డీఎం పురం ఆర్బీకే ప్రారంభానికి నోచుకోలేదు. వెదురుకుప్పం మండలంలో మాంబేడు, పచ్చికాపల్లి ఆర్బీకేలు అసంపూర్తిగా ఉన్నాయి. శ్రీరంగరాజపురం మండల కేంద్రంలో ఉన్న ఆర్బీకే అసంపూర్తిగా ఉంది. గంగాధర నెల్లూరు మండలంలో 23 ఆర్బీకేలను 13 క్లస్టర్‌గా మార్చి వాడుకుంటున్నారు.


