ఆస్పత్రుల్లో అయోమయం!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైద్యశాలలు గాడితప్పుతున్నాయి. సిబ్బంది కొరత ఆస్పత్రులను పీడిస్తున్నాయి. కొరత కారణంగా పనిచేస్తున్న వారిపై పనిభారం పడుతోంది. అదనపు పనులకు వాడేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేదలకు వైద్య సేవలు మొక్కుబడిగా అందుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి 1, ఏరియా ఆస్పత్రులు 6, సీహెచ్‌సీలు 17వరకు ఉన్నాయి. వీటిలో 1500 వరకు పనిచేస్తున్నారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ పోస్టులు 50 వరకు ఖాళీలుంటే.. ఏరియా, సీహెచ్‌సీల్లో పలు పోస్టులు 132 వరకు ఖాళీలున్నాయి. ఈ ఖాళీలు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భర్తీకి నోచుకోవడం లేదు. ఖాళీల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
ఖాళీల సంఖ్య ఇలా...
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏరియా, సీహెచ్‌సీ ఆస్పత్రుల్లో 132 పోస్టులు ఖాళీలున్నట్లు జిల్లా వైద్య విధాన పరిషత్ అధికారులు గుర్తించారు. అందులో సివిల్ సర్జన్ 2, సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ 10, సివిల్ అసిస్టెంట్ సర్జన్ 18, డిప్యూటీ సివిల్ సర్జన్ 19, స్టాఫ్‌నర్స్ 3, ఫార్మసిస్ట్ 11, థియేటర్ అసిస్టెంట్ 7, డార్క్ రూమ్ అసిస్టెంట్ 7, ఆస్పత్రి అడ్మినిస్టేటర్ 6, డీఈఓ 13, ఎంఎన్‌ఓ, ఎఫ్‌ఎన్‌ఓ 13, ల్యాబ్ అటెండెంట్ 2, పోస్టుమార్టం అసిస్టెంట్ 5, ఫ్లంబర్ 2, ఎలక్ట్రీషియన్ 2, నర్సింగ్ సూపరింటెండెంట్ 2, హెడ్‌నర్సు 1, ఆఫీస్ సబార్డినేటర్ 1, ఇతర పోస్టులు 8 వరకు ఖాళీలు చూపించారు. ఈ పోస్టులు అధికంగా కుప్పం, పలమనేరు, నగరి, పీలేరు, పుంగనూరు ఏరియా ఆస్పత్రుల్లో కనిపిస్తునాయి. వాయల్పాడు, సత్యవేడు, సదుం, బి.కొత్తకోట సీహెచ్‌సీల్లో కూడా పోస్టుల కొరత వేధిస్తోంది. ఇది పోను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని పోస్టుల భర్తీ అయోమయంలో పడింది.
అదనపు భారం...
వైద్యశాలలో సిబ్బంది కొరత కారణంగా ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందికి అదనపు డ్యూటీలు వేస్తూ వేధిస్తున్నారు. 12గంటల పాటు పనులు చేయిస్తున్నారు. స్టాఫ్‌నర్సుల ద్వారా ఇతరత్రా పనులు చేయిస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు చేయాల్సిన జనన, మరణ ధ్రువీకరణలను స్టాఫ్ నర్సుల ద్వారా చేయించుకుంటున్నారు. తద్వారా స్టాఫ్ నర్స్‌ల చేయాల్సిన విధులు గాలిలో దీపంలా మారాయి. జిల్లా ఆస్పత్రితో పాటు సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో పోస్టుల కొరతతో ఎఫ్‌ఎన్‌ఓలను అన్నింటికి వాడేస్తున్నారు. ఇంజెక్షన్‌లు వేయడం, సైలెన్ ఎక్కించడం, బ్లడ్ శ్యాంపిల్స్ సేకరించడం వంటి పనులు చేయించడం విడ్డూరమని పలువురు మండిపడుతున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. గత ప్రభుత్వం పేదల వైద్యానికి ఎలాంటి ఢోకా లేకుండా సేవలను విస్తృతం చేసింది. పల్లె పల్లెకు వైద్యసేవలను తీసుకొచ్చి..పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. వేలాది పోస్టులను భర్తీ చేసి..వైద్య సేవల్లో లోటు లేకుండా చేశారు. పోస్టులు ఖాళీ పడితే వెను వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో వైద్యసేవలు అప్పట్లో పుంజకున్నాయి. ఈ విషయాన్ని శాఖలోని పలువురు గుర్తు తెచ్చుకుంటున్నారు.
ఇదీ జిల్లా ఆస్పత్రి దుస్థితి...
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల పోస్టుల ఖాళీలు వేధిస్తున్నాయి. ఇద్దరు వైద్యులతోనే పోస్టుమార్టంను నిర్వర్తిస్తున్నారు. ఇంకా ఆరుగురు డాక్టర్లు అవసరమవుతోంది. ఇటీవల కంటి వైద్యులు సుధా మృతి చెందారు. ఈ స్థానం కూడా ప్రస్తుతం ఖాళీగానే ఉంది. అలాగే మానసిక వైద్య విభాగ వైద్యులు, దంత, చర్మ వైద్యులు, జనరల్ మెడిషన్ లేరని ఆస్పత్రి వర్గాలు వాపోతున్నారు. దీని కారణంగా వైద్యం అటుంచింతే..సదరన్ సర్టిఫికెట్ల జారీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో రెండు నెలలో మరో ఇద్దరు వైద్యులు రిటైర్ కానున్నారు. దీంతో పాటు డీఈఓలు 3, ఎంఎన్‌ఓలు, ఎఫ్‌ఎన్‌ఓలు 10, ఫార్మసిస్ట్ 17, ఓటీ అసిస్టెంట్‌లు 5 మంది, ల్యాబ్ సిబ్బంది 7 మంది భర్తీ చేయాల్సిన అవసరం ఉందని ఆస్పత్రిలోని వైద్యం బృందం డిమాండ్ చేస్తోంది. ఖాళీల కొరతతో ఇబ్బందులు తప్పడంలేదు.


