ఆగని మట్టి దోపిడీ
కుప్పం చెరువులో కొనసాగుతున్న మట్టి తవ్వకాలు
కుప్పం : కుప్పం చెరువుల్లో అధికార పార్టీ నేతలు దర్జాగా చేపట్టిన మట్టి తవ్వకాలు ఆదివారం యథాతంగా కొనసాగాయి. పట్టణ నడిబోడ్డున నివాస గృహాల మధ్యలో ఉన్న చెరువులో జేసీబీ, ఇటాచీ యంత్రాలతో ఇష్టానుసారంగా చెరువల్లో మట్టి దోపిడీ చేస్తున్నారు. రెండు రోజులుగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా మట్టి దోపిడీ చేస్తున్నారని కుప్పం పట్టణంలో ప్రజలు, సోషియల్ మీడిమా , ప్రతికలు కోడై కూస్తున్నా అధికార పార్టీ ఏమాత్రం లెక్క చేయకుండా చెరువును తవ్వేస్తున్నారు.
వేల లోడ్లు తరలించిన నేతలు
కుప్పం చెరువులో మట్టి తవ్వకాలతో రియల్ ఎస్టేట్ లే అవుట్ లోడింగ్ చేస్తున్నారు, కొందరు ఇటుకల తయారీకి కావాల్సిన మట్టి మందస్తుగా ట్రాక్టర్లుతో తోలి స్టాక్ పెట్టుకుంటున్నారు. ఒక ట్రాక్టర్ లోడ్ సుమారు రూ.400 ప్రకారం ఒప్పందం కుదుర్చుకుని కుప్పం చెరువుల్లో మట్టి తవ్వి అమ్మేస్తున్నారు. రెండు రోజులుగా నాలుగు జేసీబీ యంత్రాలు, ఇటాచీ వాహనం, 100 ట్రాక్టర్లుతో వేల లోడ్లు తరలించి సొమ్ము చేసుకున్నారు.
చెరువును శుభ్రం చేసేందుకు రూ.3 లక్షలు
పట్టణం నడిబొడ్డున చుక్క నీరు లేక ఎండిపోయి పిచ్చి మొక్కలతో నిండిపోయిన చెరువును శుభ్రం చేసేందుకు రూ. 3 లక్షల నిధులు మంజూరు చేశారు. పిచ్చిమొక్కలు తొలగించి నీటి ప్రవాహానికి సౌకర్యంగా చదును చేయాలని మున్సిపల్ అధికారులు సూచించారు. దీన్నే అదునుగా చేసుకుని భారీ ఎత్తున మట్టి తవ్వకాలు చేపట్టారు. ఇటు ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు కాగా అటు మట్టిని అమ్ముకుని అధికార పార్టీ నేతలు దోచేశారని పట్టణంలో పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం రాకపోవడం గమనార్హం.


