మాటేసిన మృత్యువు
నగరి : బతుకు తెరువు కోసం అస్సాం రాష్ట్రం దిబ్‌రూఘర్ జిల్లా టింగ్‌ఖోంగ్ దోవాపత్తర్ గ్రామానికి చెందిన రాజెన్‌ముర (42) నగరి మండలం తడుకుపేట సమీపంలోని చెరువులో పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బతుకు తెరువు కోసం రాజెన్‌ముర అసోం నుంచి వచ్చి నగరి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న రైల్వే పనుల్లో కూలీగా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం కాలకృత్యాలు తీర్చునేందుకు ట్రాక్‌పై నడిచి వెళుతున్న అతను వెనుక వైపున వస్తున్న గూడ్స్‌ను గమనించలేదు. సుదూరంగా ట్రాక్‌లను సరిచూస్తున్న కీమెన్ గూడ్స్ వస్తున్న ట్రాక్‌లోనే రాజెన్‌ముర నడిచి వస్తుండడాన్ని గమనించి అరిచి అతడిని హెచ్చరించాడు. అకస్మాత్తుగా గూడ్స్ రావడాన్ని గమనించిన రాజెన్ పక్కకు తప్పుకునే ప్రయత్నంలో ఏటవాలుగా ఉన్న ప్రదేశంలో కాలుపెట్టి అక్కడి నుంచి జారి చెరువులో పడ్డాడు. ఈత రాకపోవడంతో మునిగిపోయాడు. అక్కడికి పరుగు తీసుకుంటూ వచ్చిన కీమెన్ జారిపడ్డ రాజెన్ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడకు సిబ్బందితో చేరుకున్న సీఐ మల్లికార్జునరావ్, ఎస్‌ఐ నాయక్ ఈతగాళ్లను చెరువులో దింపి గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు గాలించిన ఈతగాళ్లు ముళ్లకంపలకు తగులుకొని ఉన్న రాజన్ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మాటేసిన మృత్యువు


