ఆకట్టుకున్న కవి సమ్మేళనం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): మన సంస్కృతి, సంప్రదాయాలకు పండుగలు ప్రతీకగా నిలుస్తాయని చిత్తూరు జిల్లా రచయితల సంఘ గౌరవాధ్యక్షుడు కట్టమంచి బాలకృష్ణారెడ్డి, అధ్యక్షుడు గిరిధరన్ అన్నారు. చిత్తూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం ‘సంక్రాంతి సంబరాలు–కవిసమ్మేళనం’ నిర్వహించారు. ఈసందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. అలాగే కోలాటలు, గొబ్బెమ్మ పాటలతో సందడి చేశారు. వారు మాట్లాడుతూ ఒకప్పుడు సంక్రాంతి పండగంటే గంగిరెద్దులు, హరిదాసులు, ఆటలపోటీలతో పల్లె, పట్నం ఉత్సాహంగా కనిపించేదన్నారు. సంప్రదాయ పూజలతో ప్రజల్లో భక్తిభావం ఉండేదన్నారు. బంధువులతో ఇళ్లంతా కళకళలాడేదన్నారు. ఇప్పుడు ఫోన్లలో మాత్రమే బంధాలు కనిపిస్తున్నాయన్నారు. మళ్లీ పాతరోజులను చూడాలంటే సంస్కృతి, సంప్రదాయాలను రాబోయే తరాలకు తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం పలువురు కవులను సన్మానించారు. కుప్పం రెడ్డమ్మ, సాహితీ ట్రస్టు నిర్వాహకులు రామలక్ష్మి, సభ్యులు కృష్ణమూర్తి, సుధాకర్ మోహన్, శైలజమూర్తి, నాగరాజు, మల్లేశ్వరరాజు, మస్తానమ్మ పాల్గొన్నారు.


