రసాయనాలను కట్టడి చేయరా?
నగరి : ఏరులై పారుతున్న రసాయనాలను కట్టడి చేయరా?.. కుశస్థలి నదిలో హానికర రసాయనాలను లక్షల లీటర్లలో విడుదల చేస్తున్న తమిళనాడు డైయింగ్ యూనిట్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోరా?.. ప్రజా సంక్షేమం అధికారులకు పట్టదా?.. దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది..? అంటూ సీపీఐ నాయకులు కుశస్థలి లోతట్టు వంతెనపై కూర్చుని ధర్నా, రాస్తారోకో చేశారు. సీపీఐ నాయకుడు కోదండయ్య మాట్లాడుతూ తమ రాష్ట్రంలో నిర్వహించే పరిశ్రమల కోసం తమిళనాడుకు చెందిన వారు నగరి మున్సిపాలిటీలో నడిపే డైయింగ్ యూనిట్లను అరికట్టడంలో అధికారుల పూర్తిగా విపలమయ్యారన్నారు. పళ్లిపట్టు నుంచి పూండి వరకు జలవనరుగా ఉన్న ఈ నదిని నగరి పట్టణంలోని డైయింగ్ యూనిట్ల వారు కలుషితం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు చర్మం, కిడ్నీ, ఎముకలు, లివర్ సమస్యలతో బాధపడుతున్నారంటే అందుకు కలుషితనీరే కారణమన్నారు. ధర్నా చేసినపుడు డైయింగ్ యూనిట్లకు నోటీసులు ఇవ్వడం.. ఆపై సమస్యను పక్కన పెట్టేయడం ఆనవాయితీగా మారిందన్నారు. ఈనెల 5వ తారీఖున ప్రజలే ఆగ్రహంతో ఉప్పొంగి పెద్ద ఎత్తున పోరాటం చేసినట్టు గుర్తుచేశారు. అక్రమడైయింగ్ యూనిట్లను నిషేధించాలని ప్రజలు కోరుతుంటే.. వాటికి అనుమతులున్నాయని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జనజీవనానికి దూరంగా డైయింగ్ యూనిట్లను పంపాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై వాహనాలు ఆగిపోవడంతో ఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ బాలాజీనాయక్, డీఈ రవీంద్ర నిరసనకారులతో మాట్లాడారు. డైయింగ్ యూనిట్ల యజమానులతో ఈ అంశంపై చర్చిస్తామన్నారు. దీంతో నిరసనకారులు శాంతించారు. సీపీఐ పట్టణ కార్యదర్శి వేలన్, నాయకులు బాషా, విజయ్‌కుమార్, రాజేంద్ర, ముత్తు పాల్గొన్నారు.
రసాయనాలను కట్టడి చేయరా?


